పవన్ ప్రచారానికి రానట్లేనా? : ఇది బీజేపీకి దెబ్బె కదా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి ఆ పార్టీ కో లెక్కుంది. సాధారణ మున్సిపల్ ఎన్నికలకు ఆఖరికి ప్రధాని మోదీ సైతం తన గాలి మరల్చడానికి రేపు హైదరాబాద్ వస్తున్నారు. మరోపక్క ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా ల తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వంటి వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. దాదాపు హైదరాబాద్తో అనుబంధం ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల తాలూకా స్థానిక నేతలు హైదరాబాదులో దర్శనం ఇవ్వనున్నారు.

విజయం కోసం ఉన్న ప్రతి దారిని బిజెపి వెతుకుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాధించిన కమలం పార్టీ ఈసారి ఎలాగైనా మేయర్ పీఠం మీద కూర్చోవాలని ఉవ్విళ్లూరుతోంది. అది పెద్ద కలే అయినా దాన్ని సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. అయితే విజయానికి ఉన్న దారిలో ఒక ప్రధానమైన దారిని బీజేపీ మర్చిపోయినట్లుంది. అదే జనసేన పార్టీ అధినేత పవన్ తో ప్రచారం చేయించడం.. ఆయన ప్రచారం బీజేపీ కు ప్లస్ అవ్వడంతో పాటు స్టార్ క్యాంపెయిన్ గా పవన్ ఉపయోగపడే అవకాశం ఉన్న దాన్ని ఎందుకు బీజేపీ పెద్దలు అంతగా పట్టించుకోవడం లేదు.

ఎందుకు వద్దు అంటే?

జనసేన పార్టీతో పొత్తు అసలు వద్దు అని బిజెపి నాయకులు మొదట భావించారు. జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్ర పార్టీగా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని ఇది బిజెపి తెలంగాణ నాయకుల మాట. అయితే దీని తర్వాత కొన్ని పరిణామాల అనంతరం జనసేన పార్టీ బిజెపికి మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ఇప్పుడిప్పుడే భాజపా జెండాలను మోస్తున్నారు. పవన్ రావడం వల్ల బిజెపి తెలంగాణ ప్రజలు ఆంధ్ర దోస్తీ పార్టీ అని భావించే ప్రమాదం ఉందని, ప్రత్యర్థులు సైతం ఇదే అంశాన్ని లేవనెత్తి ఆంధ్ర పార్టీలతో కలిసి ఇక్కడ మళ్లీ లొల్లి చేయడానికి వచ్చారు అని ప్రచారం చేస్తారని కోణంలో జనసేన పార్టీ ను మొదట వద్దనుకున్నారు. అయితే తర్వాత బిజెపి పెద్దల మాటలతో పొత్తు అంశాన్ని సరిదిద్దు కున్న పవన్ ప్రచారాన్ని వాడుకునేందుకు మాత్రం తెలంగాణ నాయకులు సిద్ధంగా లేరు. దీని వల్ల లాభం జరగకపోగా నష్టం ఎక్కువ జరుగుతుందని వారు భావిస్తున్నారు.

ఈ ఓట్లు ఎవరికీ?

జనసేన పార్టీ తరఫున మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఆ పార్టీ నేత మహేందర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 28420 ఓట్లు సాధించారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి జనసేన పార్టీ తరఫున శంకర్ గౌడ్ పోటీ చేశారు. ఆయనకు 9697 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన పార్టీ కు హైదరాబాదులో అసలు ఉనికి లేదన్నది సరికాదు. అందులోనూ జనసేన పార్టీని తెలంగాణ విభాగంలో శంకర్ గౌడ్ ముందుండి నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన శంకర్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గానే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పోరులో ప్రతి ఓటు కీలకం కానుంది. ఇటు తెరాస అటు మజ్లీస్ మరోవైపు బిజెపి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటర్లుగా విభజిస్తే ప్రతి ఓటు కీలకమే. గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ లో 40 డివిజన్లు వరకు 3000 లోపు మెజారిటీ వచ్చినవే. కాబట్టి జనసేన పార్టీ ను బిజెపి విస్మరించడం సరైన పద్ధతి కాదు. అందులోనూ హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఆయన ఆంధ్ర రాజకీయాలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించడం వల్ల యువత ఓట్లు ముఖ్యంగా బిజెపి కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బిజెపి నాయకులు అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు. కేవలం తెలంగాణ సెంటిమెంటును మాత్రమే చూస్తున్న.. హైదరాబాదులో సెటిలర్లు ఎక్కువ అన్న విషయాన్ని అందులోనూ ఆంధ్ర ప్రాంత యువత ఓట్లు పోతాయని అంశాన్ని బీజేపీ నాయకులు గాలికొదిలేశారు. ఇది ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపేదే…