నేల మీదకు రా పవన్ : జనంలోకి వెళ్లడంపై ఇక ద్రుష్టి పెడతారా?

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

పవన్ కళ్యాణ్ మాటలను ఒక్కోసారి గమనిస్తే తనకు తానూ ఎక్కువ ఊహించుకుంటారు అనిపిస్తుంది… మనం కవాతు చేస్తే లక్షల్లో జనం వస్తారు అని, పాదయాత్ర చేస్తే కార్యకర్తలను ఆపడం సాధ్యం కాదు అంటూ ఆయన చేసే ప్రకటనలు ఒక్కోసారి నవ్వు తెప్పించడమే కాదు… ఈయన ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారో అని ఆలోచనతో పాటు ట్రోలింగ్స్ ఎదుర్కుంటారు. జగన్ సైతం ఏడాది పాటు పాదయాత్ర చేసారు… చంద్రబాబు సైతం పాదయాత్ర, మీ కోసం యాత్ర అంటూ నిత్యం ప్రజల్లో మమేకం అయ్యేలా ప్రణాళిక వేసుకున్నారు. అయితే ప్రత్యామ్నాయ రాజకీయాలు, తప్పు జరిగితే ప్రశ్నిస్తామన్న పవన్ మాత్రం జన బాగోగులు చూసేందుకు వారి కోసం జనంలోకి వచ్చేందుకు ప్రతిసారి ఏవేవో చెబుతుంటారు.. ఎక్కువ ఊహాలోకంలో తేలుతుంటారు. దింతో పార్టీకు ఎనలేని నష్టం జరుగుతోంది.. అని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు.

తాజాగా ఆయన నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో డిసెంబర్ 2 , 3 తేదీల్లో పర్యటనలు పెట్టుకున్నారు. ఇది మంచి చర్య. విపత్కాలంలో రైతుల వద్దకే వెళ్లి వారిని పరామర్శించి , కష్టాలను తెలుసుకుని దాన్ని ప్రభుత్వం ముందు ఉంచి పోరాడటం అభినందించాలి. అయితే ఇదే ఊపు మీద అయన జనంలోకి వెళితే పార్టీకి కాస్త బలం పెరుగుతుంది.. ఆలా కాకుండా ఎప్పటిలాగా మళ్ళీ పర్యటన అయిపోగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా అనే ప్రశ్న , భయం జనసేన కార్యకర్తల్లోనే కనిపిస్తుంది.

** నాయకుడు అంటే జనంలో ఉండాలి. జనంలా ఉండాలి… ఇది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా డైలాగే. కానీ ఆయన రాజకీయాల్లో ఉంటానని, ప్రత్యామ్నాయ రాజకీయం మొదలు పెడతా అంటూ చెప్పినా ఇప్పటికి జనానికి దూరంగానే ఉన్నారు . ఇప్పటికే సినిమాలు,రాజకీయాలు అంటూ రెండు పడవలపై సవారీ చేస్తున్న పవన్ తీరు మీద ఆయన శత్రు సేనలు ప్రతిసారి దాడి చేస్తాయి. ఈ మాత్రం దానికి రాజకీయాలు ఎందుకు అంటూ హేళన చేసినా, దానికి పవన్ వృత్తి సినిమాలు అని, పార్టీ నడిపేందుకు ఎవడి దగ్గర చందాలు దండుకోరని, ఆయన స్వశక్తితో సినిమాలు చేసుకొని పార్టీ నడిపితే నష్టం ఏమిటని జన సైనికులు సమాధానం చెప్పినా … ఆయన ప్రతిసారి కేవలం ప్రెస్ నోట్ లకే పరిమితం అయ్యి రాజకీయాలు నడిపిస్తున్నారు అనే నిరాశ ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నపుడు కనీసం వీడియో సందేశం అయినా పంపితే బాగుటుంది అని, పార్టీ ని లైం లైట్ లోకి తేవాలంటే పవన్ యాక్టీవ్ గా వ్యవహరిస్తే మీడియా సైతం ఆయనను ఫాలో అవుతుంది అని, పార్టీకి మంచి మైలేజి వస్తుంది అని నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు.

** మంగళగిరిలో ఇటీవల పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల్లో పవన్ తీరు మీద, పార్టీ వెళ్తున్న విధానం మీద నాయకులూ గట్టిగానే పవన్ ముందు మాట్లాడారు. మిమ్మల్నే నమ్ముకుని రాజకీయ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుమని చెబుతూనే, పవన్ తీరు పట్ల, అప్పుడపుడు కనిపించి వెళ్లిపోతున్నా తీరు పట్ల, ప్రెస్ నోట్ విడుదల చేస్తూ రాజకీయాలు చేయడం పట్ల నాయకులే అసహనం వ్యక్తం చేశారు. ఎలా అయితే పార్టీ ఎప్పటికి ప్రజల్లోకి వెళ్లదని గట్టిగ అంత కలిపి చెప్పడంతో దీనిపై పవన్ పునరాలోచనలో పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీనితోనే తుఫాన్ పర్యటనను వెంటనే ఖరారు చేశారన్నది ప్రచారం.

** మరో పక్క మిత్రపక్షం బీజేపీ కి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటన మీద పవన్ సమాచారం ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో పవన్ బీజేపీ నాయకుల తీరు మీద అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది. హైద్రాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ పెద్దలు అమిత్ షా, నడ్డా కానీ పవన్ ను ప్రచారానికి పిలవకపోవడం తో పాటు బీజేపీ నాయకులూ బండి సంజయ్, అరవింద్ లు ప్రతిసారి జనసేన పార్టీను చిన్న బుచ్చేలా మాట్లాడటం, దానికి బీజేపీ పెద్దలు మౌనం వహించడంపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది . దీనితోనే తుఫాన్ పర్యటన విషయాలను బీజేపీ నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


చివరిగా…..
పవన్ కళ్యాణ్ మీద అపవాదు, అవినీతి ఆరోపణలు లేవు. వ్యక్తికత విషయాల మీదనే ఇతరులు ఆయన మీద మాట్లాడుతారు. అయితే ఏ పార్టీ అయినా జనంలో లేకపోతే, వారితో మమేకం అవ్వకపోతే మనుగడలో ఉండదు. వామపక్ష పార్టీలు ఏదైనా కార్యక్రమం చేస్తే జనం వస్తారు కానీ ఓట్లు వేయరు.. ఎందుకంటే వారు చెప్పే మాటలు సాధారణ జనానికి అర్ధం కావు. వారి బుర్రకి ఎక్కవు. ఇప్పుడు పవన్ చేస్తున్న రాజకీయం సైతం సాధారణ ప్రజానీకానికి దూరంగా ఉంది.. దీన్ని ఆయన గుర్తించి నేల మీదకు దిగితేనే జనసేన మనుగడ సాధ్యం.. ఇది నిజం….