పవన్, జగన్‌లకు వ్యవసాయం తెలుసా? : సోమిరెడ్డి

అమరావతి, డిసెంబర్ 20: వ్యవసాయ రంగానికి గత ఐదేళ్లలో తెలంగాణ కంటే ఏపీలో రూ.17361.21కోట్లు అధికంగా ఖర్చు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రూ.23,710.22 కోట్లు ఖర్చు చేస్తే ఏపీ ప్రభుత్వం రూ. 41,071.43కోట్లు ఖర్చు చేసిందన్నారు. వ్యవసాయం అంటే అర్థం తెలియని వారు మాపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గడచిన 4ఏళ్లలో వ్యవసాయంలో 11.3శాతం వృద్ధి సాధించామన్నారు. హైదరాబాద్ ఆదాయం వదిలేసి కట్టుబట్టలతో వచ్చినా వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ కంటే ముందు ఉన్నామన్నారు. ఏ విధంగా చూసినా రైతులకు ఎక్కువ మేలు చేసింది ఈ ప్రభుత్వమేనన్నారు. ఏపీ వ్యవసాయం చూసి దేశం నేర్చుకుంటుంటే… తెలంగాణ ను చూసి నేర్చుకోమని ఇక్కడి నేతలు అనటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్, పవన్ లకు అసలు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీ తప్ప వారికి ఈ లెక్కలేవీ కనబడవన్నారు. అసెంబ్లీకి హాజరు కాని మీది కూడా ఒక రాజకీయ పార్టీనా అని దుయ్యబట్టారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండని ఎద్దేవా చేశారు.

SHARE