Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan ఫ్యాన్స్, ఆడియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ధియటర్లతో సహా అందరూ ఒకేసారి హోరెత్తిపోయిన రోజు.. మే 11’ 2012. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ విడుదలైన రోజు. నేటితో 9 ఏళ్లు పూర్తైన ఈ సినిమాకు బాక్సాఫీస్ కొత్త అర్ధాలు చెప్పింది. ‘ఒక్క యావరేజ్ సినిమా ఇవ్వండి సూపర్ హిట్ చేస్తాం’ అని మెగా ఫ్యాన్స్ ఓ సందర్భంలో చిరంజీవితో కూడా అన్నారంటే పవన్ ఫ్లాపుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలాంటి టైమ్ లో వచ్చిందే గబ్బర్ సింగ్. 2001లో ఖుషి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కు ఆస్థాయి హిట్ పడటానికి 11 ఏళ్లు పట్టింది. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది.
అప్పటికి పవన్ మేనియా ఎలా ఉందంటే.. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాల బిజినెస్, కలెక్సన్లు, ఫ్యాన్స్, క్రేజ్ పెరిగిపోతోంది. కానీ.. హిట్ పడటం లేదు. ఆ సమయంలో వచ్చిందే గబ్బర్ సింగ్. పవన్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించాడు. తన మాస్ డైలాగ్ డిక్షన్, యాక్షన్ ఎలా ఉంటుందో చూపించాడు. దీంతో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్ కు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని హరీశ్ శంకర్ రాసిన ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’, ‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా’ వంటి డైలాగులు అదిరిపోయాయి. పవన్ లో అప్పటివరకూ చూడని యాక్షన్ సీన్స్ ను హరీశ్ శంకర్ ప్రొజెక్ట్ చేశాడు.
సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సన్నివేశం సినిమాను అమాంతం అంతెత్తులో కూర్చోబెట్టింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు తనను ఇండస్రీ నెంబర్ వన్ ను చేసేశాయి. పాటల్లో కూడా పవన్ ఎనర్జీతో మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లభించినట్టైంది. సినిమా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. హరీశ్ శంకర్ స్టార్ డైరక్టర్ అయిపోయాడు. నిర్మాతగా అప్పటికి రెండు ఫెయిల్యూర్స్ చూసిన బండ్ల గణేశ్ టాప్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. తిరుగులేని రికార్డులతో సినిమా శతదినోత్సవం జరుపుకుంది. అందుకు మెగా, పవన్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ ఎప్పుడూ స్పెషలే.