ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 21వ తేదీన తిరుపతిలో పర్యటించబోతున్నారు.ఈ మేరకు శుక్రవారం పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 21న సాయంత్రం తిరుపతి నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC)సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు.పవన్ కళ్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి మాట తప్పిన బీజేపీ!
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన ఉత్సాహంగా ఉండగా..రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.ఇప్పటికే బీజేపీ ఈ ఏర్పాట్లలో మునిగి తేలుతోంది.తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర అగ్రనేతలు ఇప్పటికే పలు సభలు సమావేశాలు నిర్వహించి వచ్చారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది.తెలంగాణలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీకి సిద్ధపడగా ఆఖరి నిమిషం లో బిజెపి అగ్రనేతలు పవన్ కల్యాణ్ ను ఒప్పించి పోటీ నుండి విరమింపజేశారుమ.ఈ సందర్భంగా తనకు రిటన్ గిఫ్ట్ గా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేనకి పోటీ చేసే అవకాశం కల్పించాలని జనసేనాని బిజెపి నేతలను కోరినట్లు సమాచారం.
అప్పట్లో అందుకు సరేనన్నట్లుగా బిజెపి నేతలు తలూపారని,తరువాత వారి వైఖరి మారిపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.తిరుపతి సీటు విషయంలో స్పష్టమైన హామీ కోసం పవన్ కల్యాణ్ ఢిల్లీ కూడా వెళ్లి బిజెపి అధ్యక్షుడు నడ్డాను కలిసినప్పటికీ అక్కడా చుక్కెదురైందంటున్నారు.ఈ మధ్యకాలంలో సోము వీర్రాజు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవన్నీ గమనించిన పవన్ కల్యాణ్ తాను కూడా రంగంలోకి దిగితే తప్ప ప్రయోజనం ఉండదని భావించి తిరుపతి పర్యటన పెట్టుకోవడమే కాకుండా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని సైతం నిర్వహిస్తున్నారని ఇందులో తిరుపతిలో జనసేన పోటీ విషయమై ఒక తీర్మానం చేసి బీజేపీ ముందర కాళ్లకు బంధాలు వేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి.ఏం జరుగుతుందో …ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి !