ఎన్నికల్లో బ్యాలెట్ విధానం పునఃప్రవేశపెట్టాలంటూ సుప్రీంలో పిటిషన్

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై వివిధ రాజకీయ పక్షాల నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎన్నికల సంఘం ఆ ఆరోపణలను ఖండించింది.  తాజాగా ఈ అంశంపై న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ సుప్రీం కోర్టులో న్యాయవాది సిఆర్ జయ సుకిన్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈవిఎంలలో ఓటింగ్ తప్పుగా నమోదు అవుతుందని, కచ్చితత్వం లోపిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఈవీఎం ఓటింగ్ విధానాన్ని మార్చాలని కోరారు. ఈవిఎంలు ట్యాంపరింగ్‌కు గురి అవుతాయనీ, సంప్రదాయ బ్యాలెట్ పేపర్లను వినియోగించాలనీ విజ్ఞప్తి చేశారు. ఏ దేశంలో అయినా బ్యాలెట్ ఓటింగ్ విధానంలో విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని పిటిషన్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవిఎం) స్థానంలో బ్యాలెట్ పేపర్లను వాడే విధింగా ఈసీకి అదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు న్యాయవాది సుకిన్.

ఈవిఎంలలో లోపం ఉందంటూ గతంలో వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం పలు మార్లు ఖండించింది. ఈవిఎంలు సురక్షితమని, ట్యాంపరింగ్ అసాధ్యమని ఈసీ స్పష్టం చేసింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సహా 16 రాజకీయ పక్షాలు బ్యాలెట్ పేపర్‌లతో ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేసినా ఈసీ ఓప్పుకోలేదు.