ఢాకా : బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒక దుండగుడు ఆదివారం విఫలయత్నం చేసి భద్రత దళాల కాల్పులకు హతమయ్యాడు.
ఢాకా నుంచి దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన బీజీ147 విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీ పట్టుకుని కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు విఫలయత్నం చేసినట్లు, తన వద్ద బాంబు ఉందని బెదిరించినట్లు మీడియా తెలిపింది.
విమానం ఎగురుతున్న సమయంలోనే తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడని, కాల్పులు జరిపాడని, దీంతో పైలట్లు అత్యవసరంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో విమానాన్ని దించేసినట్లు పేర్కొంది.
చిట్టగాంగ్‌లోని షా అమానత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే సాయుధ కమాండోలు ఈ విమానాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులు హుటాహుటిన టార్మాక్‌పైకి దిగిపోయారు.
మొత్తం ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. భద్రత దళాల సహకారంతో పైలెట్, కోపైలెట్, సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.
దుండగుడిని లొంగిపోవాలని సాయుధ కమెండోలు హెచ్చరించినా, వినకుండా తనతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేసిన్నట్లు సమాచారం.
కమెండోలు కాల్పులు జరపడంతో దుండగుడు హతమయ్యాడు.