నేడు హైదరాబాద్ కు ప్రధాని రాక.. సీఎం కేసీఆర్ కు పీఎంఒ షాక్ 

 

 

కరోనా వాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ వంటి ఏర్పాట్లు స్వయంగా సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ నగర శివారు లోని భారత్ బయోటెక్ సంస్థ కు విచ్చేస్తున్నారు. తొలుత పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్ పర్యటనలు ఖరారు కాగా పుణె పర్యటన రద్దు అయ్యింది.

ఈ నేపథ్యంలో మోడీ నేరుగా మధ్యాన్నానికే ప్రతేక విమానంలో హాకింపేట వైమానిక స్థావరానికి చేరుకుంటారు. అక్కడ నుండి నగర శివారులోని జినోమ్ వాలిలో గల భారత్ బయోటెక్ సంస్థ కు మోడీ చేరుకుంటారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సీన్ పేరుతో టీకా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మూడో దశ క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మోడీ ఈ సంస్థ లో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తి ని పరిశీలించి పురోగతి పనులు సమీక్ష చేస్తారు. భారత్ బయో టెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో పీఎం మోడీ మాట్లాడతారు. సుమారు గంట పాటు మోడీ ఈ సంస్థ లో పర్యటన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

కేసీఆర్ ను దూరం పెట్టిన పీఎంఒ

సాధారణంగా పీఎం రాష్ట్ర పర్యటన కు వచ్చినప్పుడు గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులు వెళ్లి విమానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతుంటారు. ఇదేవిధంగా చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ప్రధానికి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం కార్యాలయం నుండి పీఎంవో కు సమాచారం ఇచ్చారు. అయితే హకీంపేట విమానాశ్రయంలో పి ఎం కు స్వాగతం పలికేందుకు అయిదుగురు అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రధాని వ్యక్తిగత సహాయకులు వివేక్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సి ఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ సిపి సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ మాత్రమే విమానాశ్రయానికి రావడానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. పీఎం పర్యటనలో సీఎం కేసీఆర్ ను దూరం పెట్టడం ఇటు అధికార వర్గాల్లో, మరో పక్క రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.