కరోనా వాక్సిన్ పై మోడీ స్వయం సమీక్ష

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వాక్సిన్ అభివృద్ధి పై స్వయంగా సమీక్షించేందుకు హైదరాబాద్‌ శివారులోని భారత్ బయో టెక్ ను సందర్శించారు. తొలుత ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లోని జైడిస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి మరో ముగ్గురు అధికారులు మోడీకి స్వాగతం పలికారు.

తరువాత ప్రధాని మోదీ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌కు చేరుకున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవాగ్జిన్ టీకా అభివృద్ది, ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలపై మోడీ సంస్థ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రయోగశాలలోకి వెళ్లి పరిశీలించారు. టీకా ఉత్పత్తి అంశాలను శాస్త్రవేత్తలు మోడీకి వివరించారు. ఈ సందర్బంగా మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు.

ప్రధాన మంత్రి మోదీ స్వయంగా కరోనా కట్టడికి టీకా అభివృద్ది చేస్తున్న సంస్థల వద్దకు వెళ్లి సమీక్ష జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ చేరుకున్న తరువాత మోదీ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వాక్సిన్ పై కీలక ప్రకటన చేసేందుకే మోడీ స్వయంగా అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె లను సందర్శించి శాస్త్రవేత్తలు, వాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థలతో చర్చించారని భావిస్తున్నారు.