‘మన్‌ కీ బాత్’కు విరామం

ప్రధాని నరేంద్ర మోది ‘మన్‌ కీ బాత్’కు విరామం ప్రకటించారు. మళ్ళీ మేలో ‘మన్‌ కీ బాత్’తో వస్తానని ప్రధాని అన్నారు.

ఈరోజు మోది 53వ ‘మన్‌ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పది రోజుల క్రితం భరతమాత తన సాహస పుత్రులను పలువురుని కోల్పోయిందని పుల్వామా ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దాడిని మోది ఖండించారు. అమరజవాన్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశ ప్రజలంతా ఈ ఘటనతో తల్లడిల్లిపోయారని, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని అని మోది అన్నారు. అమరజవాన్లు, వారి కుటుంబాలకు సంతాపాలు, సంఘీభావాలు వెల్లువెత్తాయని మోది పేర్కొన్నారు. మన సాయుధ బలగాలు ఎప్పుడూ మొక్కవోని సాహసం ప్రదర్శిస్తూనే ఉన్నాయని మోది స్పష్టంచేశారు.

ఒక వైపు అత్యద్భుత ప్రతిపా పాటవాలు ప్రదర్శిస్తూనే, మరోవైపు శాంతిని కాపాడుతున్నాయని మోది అన్నారు. టెర్రరిస్టులకు వారి భాషలోనే బలగాలు దీటుగా జవాబిస్తున్నాయని మోది కొనియాడారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా దేశరాజధానిలో నేషనల్ వార్ మెమోరియల్ సిద్ధమైందని మోది చెప్పారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోది ‘మన్ కీ బాత్’ కి విరామం ప్రకటించారు. ‘ నేను ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తాను. అందుకే ఇప్పటికి మన్ కీ బాత్‌ను ఆపేస్తున్నాను. మన్ కీ బాత్ మళ్ళీ మీ ఆశీర్వాదంతో, ఒక కొత్త విశ్వాసంతో తిరిగి ప్రారంభమవుతుంది. నేను మళ్లీ మే చివరి ఆదివారం మీ ముందుకు వస్తాను. ఎన్నికల తర్వాత మీతో నా ఆలోచనలను పంచుకుంటాను ‘ అని మోది అన్నారు.