సాయంత్రం 6గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న పిీఎం మోడి..

 

(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని మోడీ  ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  అయితే ప్రధాని ఏ అంశంపై మాట్లాడతారు అనే విషయం పేర్కొనలేదు. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం విజయదశమి వేడుకలు జరుగుతున్న ఈ తరుణంలో కరోనా వైరస్ పరిస్థితిపై సందేశం ఉండవచ్చని నెటిజన్‌లు భావిస్తున్నారు.

 

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల 76 లక్షలకు దగ్గరగా ఉంది. అయితే  దాదాపు మూడు నెలల్లో మొదటిసారి ఒక రోజులో 50 వేల కంటే తక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 46,790 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం ఇప్పటి వరకూ నమోదు అయిన కేసుల సంఖ్య 75,97,063 కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 67,33,329 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.  దేశంలో కరోనా విజృంభణ ప్రారంభం అయిన తరువాత నిన్నటి కంటే తక్కువగా జూలై 23న 45,720 కేసులు నమోదు అయ్యాయి. సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు 90వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరో వైపు రికవరీల రేటు పెరుగుతోంది. దాదాపు 88.26 శాతం మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 10.23 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.52 శాతంగా ఉంది. ఈ గణాంకాలను ఈ ఉదయం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై మాట్లాడతారని అనుకుంటున్నారు.