జగన్ కి.., రాష్ట్రానికీ.. పోల”వరమా”..? శాపమా..!?

పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం ఓ బాంబు వేసింది..!!

పోలవరం కోసం మరో రూ. 47 వేల కోట్లు అవసరమని.., కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది అంటే ఎలా అంటూ ఏపీ ప్రభుత్వం ఆవేదన చెందుతుంది. నాడు టీడీపీ ప్రభుత్వం 2014 లెక్కల ప్రకారం ఆమోదించడం వలనే ఈ సమస్య అంటూ ఆర్ధిక మంత్రి బుగ్గన వాదిస్తున్నారు..!

లేదు. పోలవరానికి రూ. 55 వేల కోట్లు ఖర్చు అవుతాయని రెండేళ్ల కిందటే అంచనాలు వేసి, కేంద్రానికి నివేదించామని… జగన్ ప్రభుత్వం వాటిని సాధించుకోవడంలో విఫలమవుతుంది అంటూ నాటి జలవనరుల మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు..!!

ఏమిటీ వాదనలు..? ఏమిటీ క్లిష్టత..? పోలవరం కేవలం జగన్ కో, చంద్రబాబుకో.., మోదీకో చెందిన ప్రాజెక్టు కాదు. ఏపీకి జీవనాడి. రాష్ట్రంలో సగం ప్రాంతాలకు ఊపిరి. అటువంటి ప్రాజెక్టు విషయంలో ఈ చిక్కుముడి ఏపీకి, సీఎం జగన్ కి వరమా..? శాపమా..?? అసలు ఈ క్లిష్టతకి మూల కారణం ఏంటి అనేది చూద్దాం..!!

ఇప్పటికిప్పుడు ఎంత కావాలంటే..!?

జరిగిన పనులు వదిలేసి.. ఇంకా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మాత్రం కనీసం రూ. 47 వేల కోట్లు రావాల్సిందే అనేది కచ్చితమైన లెక్కగా చెప్తున్నారు. దీనిలో భూ సేకరణ, పునరావాసానికి రూ. 29 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన వ్యయం నిర్మాణం కోసం వెచ్చిస్తారు. సో.., ఎవరెన్ని వాదించినా రూ. 47 వేల కోట్లు కేంద్రం ఇవ్వకుంటే ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

కేంద్రం కక్కుర్తి “రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం”..!

రాష్ట్ర విభజన 2014 లో జరిగింది. సో.., అప్పటి అంచనాల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్తుంది. అందుకే రూ. 20398 కోట్లు ఫైనల్ అని తేల్చి చెప్తుంది. ఇది మరీ అన్యాయం కదా..! ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చినప్పుడు.., అది పూర్తయ్యే వరకు కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. కానీ బీజేపీ కక్కుర్తి వ్యవహారాలూ, వింత వాదనలతో ముప్పుతిప్పలు పెడుతుంది. ఇది రాష్ట్రానికి నూరుశాతం అన్యాయమే. “కాలం గడుస్తూ ఉంటె సాంకేతికంగా అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కడైనా జరుగుతుంది. మోడీ వేసుకునే సూట్ కూడా 2014 లో ఉన్న ధర ఇప్పుడు ఉండదు కదా..? అటువంటిది ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూ సేకరణ వ్యయం ఆరేళ్ళు అయినా అలాగే ఎందుకు ఉంటుంది..? కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వయవహరిస్తూ, కొర్రీలు పెడుతూ రాష్ట్రంతో ఆడుకుంటుంది అనేది స్పష్టం..!!

మనలో తప్పెవరిది..? కక్కుర్తి ఎవరిదీ..!?

ఇక్కడ మరో కీలక విషయం ప్రస్తావించాలి. కేంద్రం కొర్రీలు పెడుతుంది. కేంద్రం అన్యాయం చేస్తుంది. కేంద్రం మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంది అనేది నూటికి నూరుపాళ్లు నిజమే. కానీ కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చింది ఎవరు..? కేంద్రం చేతిలో ఉండాల్సిన బాధ్యతని మేము చూసుకుంటాం అంటూ కక్కుర్తి వ్యవహారాలు నడిపింది ఎవరు..? అనేది ఓ సారి ఆలోచించాలి..!

2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రాజెక్టు కాంట్రాక్టులో కమీషన్లు కక్కుర్తితో వ్యవహరించింది. భూసేకరణ వ్యయం గురించి ఆలోచించకుండా “నిధులు మీవి, పనులు మావి” అంటూ కేంద్రంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా * 2014 నాటి అంచనాలని భరిస్తామన్న కేంద్రం వాదనను వ్యతిరేకించలేదు. * అంతకు ముందు (అంటే వైఎస్ హయాంలో) చేసిన ఖర్చు రూ. 5 వేల కోట్లు కేంద్రం ఇస్తామని చెప్పలేదు, టీడీపీ ప్రభుత్వం అడగలేదు. అంటే ఏదోలా పనులు బాధ్యతలు తీసుకోవాలి, తమ వారికి అప్పగించేయాలి.., కాసులు పోగేసుకోవాలి అనే ఓ అంతర ఉద్దేశంతో టీడీపీ సర్కారు ఈ కక్కుర్తికి తెరతీసింది. మూల కారణంగా మారింది.

కానీ 2018 నాటికి ఇక తత్వం బాధపడి మేము చేయలేము బాబోయ్ రూ. 55 వేల కోట్లు కావాల్సిందే అంటూ ఓ నివేదికను తయారు చేసింది. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కేవలం భూసేకరణ, పునరావాసానికి రూ. 29 వేల కోట్లు అవుతుంది అనే విషయాన్నీ మొదట్లో పెద్దగా పట్టించుకోని బాబు సర్కారు, ఆ తర్వాత గ్రహించింది. అందుకే కేంద్రం వద్ద దస్త్రం పెట్టింది.

* జగన్ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది..? అంతకు ముందు అంచనాలు, వ్యయం మొత్తం లెక్కలు తేల్చి కేంద్రం ముందు పెట్టి రాబట్టడంలో విఫలమయింది. భూసేకరణ వ్యయం గురించి భారీగా నిధులు అవసరమని.., బాబు ప్రభుత్వం చేసిన తప్పులను (ఒప్పందం అంశాలను) అప్పుడే బయటపెట్టలేదు. కేవలం రీటెండర్లు అంటూ ఇన్నాళ్లు కాలక్షేపం చేసింది. ఇప్పుడు పీకల వరకు మునిగే సమయం వచ్చాక.. ఇదే కేంద్రం చేతికి అస్త్రంగా మారింది. ఇది జగన్ కి వరంగా మారాలి అంటే మొత్తం కేంద్రం నుండు రాబట్టి పనులు చేయించాలి.

సో.. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే..!!

పోలవరం విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తుంది అనేది ఎంత నిజమో.., టీడీపీ ప్రభుత్వం కాసుల కక్కుర్తికి తెరతీసింది అనేది అంతే నిజం. భూ సేకరణ అంశాన్ని మొదట్లో తేలిగ్గా తీసుకోవడం అంతే తప్పు. జగన్ వచ్చాక కూడా నిర్మాణ రీటెండర్లు అంటూ అన్నారు కానీ.., భూసేకరణ గొడవ, ఆ భారీ లెక్కని అప్పుడే తెరమీదకు తీసుకురాలేదు. ఇదేదో 2014 నాటికే “ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అంచనాలను ఎంత పెరిగితే అంట కేంద్రమే భరించాలి” అనే పాయింట్ ని చేర్చడమో.., “జాతీయ ప్రాజెక్టు మీరే పనులు చేసుకోండి, మాకు వద్దు” అంటూ మొదటి నుండీ కేంద్రంపై భారం వేయడమే చేయలేదు. ఇవే ఈ ఇష్యూకి కారణాలు, కేంద్రం వాదనలకు కారణాలు..!!