పోలవరం గిన్నిస్ రికార్డు!

అమరావతి, జనవరి 7: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనులను శరవేగంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8గంటల సమయానికి 29.664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి ఈ రికార్డును సాధించారు.

జనవరి నెల చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్లొన్నారు. ప్రతి గంటకు సగటున 1500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్ చేశారు. అర్థరాత్రి ఫ్లడ్‌లైట్‌ వెలుగులో పనులు నడిచాయి. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం రాత్రి అంతా పనులను స్వయంగా పర్యవేక్షించారు.

ఆదివారం ఉదయం 8గంటల నుండి ఈ పనులు ప్రారంభించగా దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు. అధికారుల ఆధ్వర్యంలో నవయుగ సంస్థ కాంక్రీట్ పనులు చేపట్టి రికార్డులను బద్దలు కొట్టింది. పోలవరం ప్రాజెక్టు ఈ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నవయుగ ఎండీ శ్రీధర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

గిన్నిస్ బుక్ ప్రతినిధి విశ్వనాధ్ తన ప్రతినిధి బృందంతో ప్రతి 15నిమిషాలకు ఒక సారి గణాంకాలను నమోదు చేసుకున్నారు. సోమవారం మధ్యహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించి గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు.