అగస్టాపై అట్టుడుకుతున్న రాజకీయం

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలీకాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి మిఛెల్ క్రిస్టియన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రస్వావించారంటూ ఈడీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేయడంతో రాజకీయం వేడెక్కింది. మిఛెల్ క్రిస్టియన్ విచారణలో పలు అంశాలను వెల్లడించాడని పేర్కొన్న ఈడీ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కస్టడీకి కోరింది.

అయితే మిఛెల్ క్రిస్టియన్ నోట సోనియా పేరు చెప్పించడానికి అతడిని చిత్రహింసల పాల్జేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే కేంద్ర మంత్రులు మాత్రం గాంధీల గుట్టు బయటపడుతోందని సంబరపడుతున్నారు.రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ లు అగస్టా కుంభకోణంలో వెలుగుచేస్తున్న విషయాల నేపథ్యంలో గాంధీ కుటుంబం జవాబు చెప్పుకోవలసిన రోజు వచ్చిందన్నారు. నిందితుడు స్వయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లు వెల్లడించారనీ, ఆ కుటుంబం అవినీతికీ, అగస్టా లో ప్రమేయానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.

దర్యాప్తు సంస్థలను తమ పెంపుడు జంతువుల్లా భావిస్తున్న బీజేపీ హయాంలో నిందితుడి నోట వారికి కావలసిన మాటలు చెప్పించడానికి అతడిని చిత్రహింసలు పెట్టారనీ, విచారణ సమయంలో న్యాయవాదులు ఉండకూడదన్న ఈడీ డిమాండే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. రాఫెల్ విషయంలో ఆరోపణల నేపథ్యంలో ఎదురుదాడి కోసమే మిఛెల్ క్రిస్టియన్ ను పావులా కేంద్రం ఉపయోగించుకుంటోదని కాంగ్రెస్ అంటోది. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో ఈ విషయంపై మరింత ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో మిఛెల్ వ్యవహారాన్ని విపక్షాలను ఇరుకున పెట్టేందుకు కేంద్రం వాడుకుంటుందన్నది నిర్వివాదాంశం

SHARE