బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. వీరు ఇద్దరు సొంత గూటికి చేరతారా..? లేదా వారు అభిమానించే దివంగత నేత వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల నేతృత్వంలో నడుస్తున్న వైఎస్ఆర్ టీపీ వైపు వెళతారా..? ఈ రెండు కాదనీ బీజేపీ వైపు అడుగులు వేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన ఈ ఇద్దరు నేతలు ఏమి చేయబోతున్నారు..? ఇద్దరూ కలిసే ఒక పార్టీలో చేరతారా..? లేక ఎవరి దారి వారు చూసుకుంటారా..? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పొంగులేటి ఆధ్వర్యంలో కొత్త పార్టీ పెడతారు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ ప్రచారాన్ని జూపల్లి కొట్టేపారేశారు. కొత్త పార్టీ అంటూ జరుగుతున్న ప్రచారం ఊహజనితమేనని పేర్కొన్నారు.

తన అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన విడుదల చేస్తానని చెప్పారు జూపల్లి. ఇదే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ వైపునకు వెళ్లే ప్రసక్తేలేదన్నట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యక్తిగతంగా ఎంతో ఇమేజ్ ఉన్న పొంగులేటిని చేర్చుకుంటే తమ పార్టీ మరింత బలోపేతం అవుతున్న ఆశలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మరో పక్క ఈ ఇద్దరు నేతలకు దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే బీజేపీ పెద్దలతో పొంగులేటి టచ్ లో ఉన్నారనీ, ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పొంగులేటితో చర్చలు జరిపారని అంటున్నారు. అటు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోనూ పొంగులేటితో సన్నిహిత పరిచయాలే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పలువురు తన అనుయాయులకు పార్టీ పేరు చెప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్ధిత్వాలను ఖరారు చేశారు పొంగులేటి. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు కావడంతో అభ్యర్ధిత్వాల ఖరారు కేంద్ర బీజేపీ ఫైనల్ చేస్తుంది. పొంగులేటి చెప్పిన వాళ్లందరికీ టికెట్ ఇవ్వాలంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంగీకరిస్తాయా అనేదే పెద్ద డౌట్ అనుమానం.
ఇక పూర్తి స్థాయిలో తాను అనుకున్న వారికి టికెట్ లు కన్ఫర్మ్ చేసే పార్టీగా వైఎస్ఆర్ టీపీ ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీకి అంతగా ఓటు బ్యాంక్ లేదు. కాంగ్రెస్, బీజేపీలకు స్వతహాగా కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీల ఓటింగ్ కు తోడు పొంగులేటి వ్యక్తిగత చరిష్మా కలిస్తే గెలుపు సునాయాశం అవుతుందన్న ఆలోచనలో క్యాడర్ ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ శాతం క్యాడర్ మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక జూపల్లి కృష్ణారావు సన్నిహితంగా ఉండే నేతలు పలువురు ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. ఆ క్రమంలోనే డీకే అరుణ .. పొంగులేటిని బీజేపీకి అహ్వానించిన్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. వైఎస్ విజయమ్మ పొంగులేటిని ఉద్దేశించి ఆయన తమ కుటుంబ సభ్యుడని, కచ్చితంగా తమ పార్టీ (వైఎస్ఆర్ టీపీ)లోకి వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరి చక్రం తిప్పుతారు అనేది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
స్వతహాగా పెద్ద కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తాను ఎంపీగా గెలవడంతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించుకుని తన సత్తా ఏమిటో చాటుకున్నారు. ఆ తర్వాత పొంగులేటి సహా ఆ ముగ్గురు ఎమ్మెల్యే అధికార బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) తీర్దంపుచ్చుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దానికి తోడు పార్టీలోనూ సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతో పార్టీ పట్ల అసంతృప్తితో ఉండిపోయారు. గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సొంత క్యాడర్ ను అభివృద్ధి చేసుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చారు పొంగులేటి.
ఇక మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి జూపల్లి కృష్ణారావు వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999,2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన జూపల్లి 2011 అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు. 2011 లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 2018 ఎన్నికల్లో తొలి సారి కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు. జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకు ముందు దివంగత వైఎస్ఆర్ హయాంలో ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూపల్లి పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో చేరడంతో జూపల్లికి పార్టీలో ప్రభుత్వం ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో మూడేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.