ప్రభాస్ లైఫ్ లో ఎప్పుడు కష్టపడనంతగా లేటెస్ట్ సినిమా సలార్ కోసం కష్టపడుతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటోంది. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంతగా తన బాడిని మార్చుకున్నాడో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి తెలిసిందే. రాజమౌళి సూచన మేరకు ప్రభాస్ భారీగా కసరత్తులు చేశాడు. బాహుబలి సినిమా కోసం తన దేహాన్ని చాలా మార్చుకున్నాడు. యాక్షన్ సీన్స్ చూస్తున్న ప్రతీ ఒక్కరు ప్రభాస్ ని చూసి నివ్వెరపోయారంటే అది రాజమౌళి ప్రభాస్ మీద తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ద అని చెప్పక తప్పదు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సలార్ సినిమా కోసం ప్రభాస్ బాహుబలి సినిమా సమయంలో కష్టపడినదానికి పదిరెట్లు ఎక్కువ కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సూచనల మేరకు ప్రభాస్ తన బాడీని బలిష్టంగా కనిపించేలా కసరత్తులు చేస్తున్నాడట. సలార్ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కండలు తిరిగిన దేహదారుడ్యంతో కనిపించబోతున్నాడట. అందుకే ఈ పాత్ర కోసం ప్రభాస్ ఇంతగా కష్టపడుతున్నాడని అంటున్నారు.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ ని ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే భారీ యాక్షన్ తో వచ్చిన కెజీఎఫ్ 1 తో ప్రశాంత్ నీల్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. అంతేకాదు తాజాగా రూపొందున్న కెజిఎఫ్ 2 తో కూడా ప్రశాంత్ నీల్ లో ఉన్న స్టామినాని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సలార్ మీద అసాధారమైన క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాని కేవలం 4 నెలల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021 విజయదశమి కి ప్రపంచ వ్యాప్తంగా సలార్ రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ చేసినట్టు సమాచారం.