ప్రణబ్‌కు భారతరత్న!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్న వరించింది. ఈ అవార్డు చరిత్రలో తొలిసారిగా మరో ఇద్దరికి మరణానంతర భారతరత్న ప్రకటించారు. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలకు ఈ గౌరవం దక్కింది.

చండికా దాస్ అమృత్‌రావ్ దేశ్‌ముఖ్ 1916లో జన్మించారు. 2010 ఫిబ్రవరి 27న ఆయన మరణించారు. బిజెపి పూర్వ రూపమైన జనసంఘ్‌ పార్టీ నాయకుడాయన. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో పని చేసిన సామాజిక కార్యకర్తగా వికీపీడియా నానాజీని అభివర్ణించింది. ఆరెస్సెస్ సభ్యుడిగా ఆయన ప్రస్తానం మొదలయింది. 1999లో ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో గౌరవించింది.

భూపేన్ హజారికా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నేపధ్య గాయకుడు, రచయిత, సంగీతకారుడు, కవి, సినీ నిర్మాత. ఆయన ప్రధానంగా అస్సామీ భాషలోనే పాడారు. అయితే హజారికా పాటలను అన్ని భారతీయ భాషలలోకీ అనువదించారు. ఎక్కువగా బెంగాలీ, హిందీ భాషలలోకి హజారికా పాటలు అనువాదమయ్యాయి. ఈశాన్య ప్రాంతం సంగీతాన్ని, ముఖ్యంగా అస్సామీ సంగీతాన్ని జాతీయ స్రవంతిలోకి తెచ్చిన ఘనత హజారికాదే. 2011 నవంబర్ అయిదున ఆయన మరణించారు.

జీవితకాలం కాంగ్రెస్ వాదిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకూ భారత రాష్ట్రపతిగా చేశారు. అంతకు ముందు ఆయన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, ఆర్దిక శాఖలు నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

2017లో పదవీ విరమణ చేసిన ప్రణబ్‌కు రెండవ సారి పదవి చేపట్టే అవకాశం ఇవ్వని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వడం  విశేషం. పదవీవిరమణ తర్వాత ఆయన ఒకసారి నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టారు.