Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసి జైల్ కు తరలించడంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ పై తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో సుప్రీం కోర్టులో అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ (1) రాజ్యాంగబద్దతపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు కేసుల నుండి బయటకు రావడానికి 17 ఏ వర్తిస్తుందనీ, ఆయనపై నమోదైన కేసు క్వాష్ అవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ అగర్వాల్, సిద్ధార్ధ్ లూథ్రా తదితర న్యాయవాదులు 17ఏ గురించే బలంగా వాదనలు వినిపించారు. సోమవారం సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ జరగనున్న తరుణంలోనే ఇదే సెక్షన్ కు సంబంధించి రాజ్యాంగబద్దతపై సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశం అవుతోంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ (1) రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. జస్టిస్ బీవి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు చేయాలంటే సంబంధిత యంత్రాంగం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ షరతు వలన సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశంతో పాటు, ముందస్తు అనుమతి రాకుండా లాబీయింగ్ చేసేందుకు సమయం కూడా నిందితుడికి లభిస్తొందని ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.