అతన్ని వెంటనే మార్చండి : కేజ్రీవాల్

ఢిల్లీ, ఫిబ్రవరి 8: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాధన్ హత్యకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు విచారణకు గైర్హాజరు అవ్వడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

పది సంవత్సరాల క్రితం టివి జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాధన్ హత్యకు గురయ్యింది. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని హతురాలి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ కేసును ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

కోర్టు విచారణకు హజరు కాని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తక్షణం షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని నేడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశించారు.

హోంమంత్రిత్వ శాఖతో సంప్రదించి స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని ఆదేశించారు.

సౌమ్య హత్య కేసులో 2009లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.

ఫిబ్రవరి రెండున, నేటి విచారణ సమయంలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గైర్హాజరు అవ్వడంతో సౌమ్య తండ్రి ఎంకె విశ్వనాధన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ,

గతంలో పని చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో  పాటు నేడు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వృత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ఎంకె విశ్వనాధన్ ఆవేదన వ్యక్తం చేశారు.

2008 సెప్టెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 3,30గంటల ప్రాంతంలో డ్యూటి ముగించుకుని ఇంటికి వెళుతుండగా సౌమ్య హత్యకు గురి అయ్యింది.