‘భారత ప్రభుత్వానికే వదిలేస్తే మంచిది’


పుణె: పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న అన్ని రకాల సంబంధాలు తెగిపోతున్నాయి. ఇప్పటికే భారత్ పలు కీలక చర్యలకు ఉపక్రమించగా.. ఇప్పుడు ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించేలా చర్యలు చేపట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో టీమిండియా జట్టు ఆడకూడదనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా.. పాకిస్థాన్ జట్టుతో ఆడాలా? వద్దా? అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేయడం మంచిదని ఈ మాజీ క్రికెటర్ సూచించారు.

‘ప్రపంచ కప్ టోర్నీలో పాక్ జట్టుతో టీమిండియా ఆడాలా? వద్దా? అనేది మనలాంటి వారు నిర్ణయించే అంశం కాదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మనం మన అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా.. ఈ అంశాన్ని ప్రభుత్వానికి, సంబంధిత వ్యక్తులకు వదిలేయడం మంచిది. దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు’ అని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా, ఒక వేళ భారత ప్రభుత్వం ప్రపంచ కప్ టోర్నీలో ఆడొద్దని నిర్ణయిస్తే టీమిండియా ఆడదని హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. మెగా టోర్నీలో ఆడికపోతే మనకే నష్టమని మరో సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం.. ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఆడాలని.. పాకిస్థాన్‌ను ఓడించాలన్నారు. భారత విజయాన్ని అమరులకు అంకితమివ్వాలన్నారు.

కాగా, ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలను క్రీడల నుంచి దూరంగా పెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ మండలికి ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీసీఐ తరపున సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ఈ మేరకు పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండా ఐసీసీకి ఓ లేఖను పంపింది. అయితే, భారత్‌లో జరిగిన అన్ని ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలే బాధ్యత వహించిన విషయం తెలిసిందే.

ఐసీసీ సభ్య దేశాలైన యూకేతో సహా అన్ని దేశాలు పుల్వామా ఉగ్రదాడిని ఖండించాయి. పుల్వామా ఘటన నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 14న జేషే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.