రఫేల్ డీల్: తీర్పు రివ్యూకు సుప్రీంకోర్టు ఓకే


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని నిర్ణయించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై తాము ఇది వరకే ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు.

36 రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో అనేక తప్పులతో కేంద్రం కోర్టుకు నివేదిక ఇచ్చిందని, వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పును సమీక్షించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ విచారించారు. తీర్పు సమీక్ష పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.‘ఈ పిటిషన్లు విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాస్త కష్టమైన పని. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని చీఫ్ జస్టిస్ గొగొయ్ తెలిపారు.

రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గత డిసెంబర్ 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదికా కన్పించలేదని కోర్టు పేర్కొంది.

అంతేగాక, ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయితే, ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు దాఖలవడంతో తాజాగా సుప్రీంకోర్టు.. సమీక్షకు సానుకూలంగా స్పందించింది.