హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

71 views

కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని రాహుల్ ఆరోపించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

‘ ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని.. ప్రతి పేద వాడి ఖాతాలో 15 లక్షల రుపాయాలు వేస్తామని మోది ఇదే తిరుపతి వేదికగా హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని కూడా తిరుపతిలోనే హామీ ఇచ్చారు. నాడు మోది ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలైందా? మోది ఇచ్చిన హామీలు, ప్రకటనలు అన్నీ అబద్ధం. అవినీతి అంతానికి ప్రధానిగా కాకుండా కాపలాదారుగా కృషి చేస్తానని మోది అన్నారు. అదే ప్రధాని.. రఫెల్ కుంభకోణంలో అనిల్‌ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

‘ రైతుల భూములను ఇష్టానుసారం తీసుకోవడానికి వీలు లేకుండా 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని,తమ హయాంలో రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం ఇస్తే రుణమాఫీ చేస్తామన్నాం. అధికారంలోకి ఇచ్చిన 10 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పాం. కానీ, రెండ్రోజుల్లోనే అమలు చేసి చూపాం. ఈ ప్రధాని మోది బడా వ్యాపారవేత్తలకు రూ.3.5లక్షల కోట్లు రుణమాఫీ చేశారు’ అని రాహుల్‌ విమర్శించారు.

‘దేశ భక్తులమంటూ మోది చెబుతున్నారు. కానీ జమ్మూలో సైనికులపై ఉగ్రదాడి వార్త తెలిసి కూడా ఆయన మూడున్నర గంటలపాటు డిస్కవరి ఛానల్ డాక్యూమెంటరి షూటింగ్‌లో పాల్గొన్నారు. నవ్వుతూ కెమెరాల ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇది అతను సిగ్గు పడాల్సిన విషయం. ఇలాంటి వ్యక్తి జాతీయవాదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జేడీ శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు సభలో పాల్గొన్నారు.