ఎన్నికల ముందు విద్యార్థులపై దృష్టి

ఎన్నికలు దగ్గర పడుతుంటంతో బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విద్యార్థులతో ముఖా ముఖి చర్చలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఏడుగురు యువ విద్యార్థులతో సప్రైజ్ డిన్నర్ పేరిట విందులో పాల్గొని ప్రజల జీవితాలను మెరుగు పరచటంపై చర్చించారు. అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ మానిఫెస్టోలో కొన్ని అభిప్రాయాలను చేరుస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోది కూడా విద్యార్థులతో పరీక్షా పే చర్చ 2.0 పేరుతో ముఖా ముఖిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 2000 విద్యార్థులు, వారి తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలకు ముందు, తరువాత విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తాజాగా రాహుల్ మరోసారి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ‘శిక్షా దిశా’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించారు. దేశంలో ఉపాధి అవకాశాలు,విద్యా వ్యవస్థ స్థితి గతులపై రాహుల్ ప్రసంగించారు.

‘ ప్రభుత్వం విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు బ్యాంకు రుణాలు సులభతరం చేయాలి. మరిన్ని యూనివర్సిటీలు నెలకొల్పాలి. స్కాలర్ షిప్ లు ఇవ్వాలి. కానీ బిజెపి పాలనలో ఇవేం జరగలేదు. గడచిన ఐదేళ్ళలో ప్రభుత్వం విద్యా రంగానికి కేటాయించిన మొత్తంలో క్షీణత కనిపించింది’ అని రాహుల్ విమర్శించారు.

‘ తాత్కాలిక ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనిశ్చితి నెలకొంది. వీళ్ళని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం విద్యా వ్యస్థలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి’ అని అన్నారు.

‘ఐరోపా, అమెరికా దేశాలతో పోల్చుకుంటే భారత దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు’ అని విమర్శించారు.