కాలినడకన తిరుమలకు రాహుల్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన బయల్దేరారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి తిరుపతికి చేరుకుని, సాయంత్రం 4.30 గంటలకు బాలాజీకాలనీ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తోన్న ‘ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర’ లో పాల్గొననున్నారు.

తారకరామ స్టేడియం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ఈ సభలో హోదాపై పార్టీ వైఖరిని వెల్లడించనున్నారు. రాహుల్ తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరవనున్నారు. సభ ముగిసిన తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

2014 ఎన్నికల సమయంలో మోది సభ నిర్వహించిన ప్రాంగణంలోనే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఈ సభను నిర్వహిస్తున్నది. ఇదిలా ఉండగా రాహుల్‌ శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో సాధరణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ప్రకటించింది.