ఎప్పుడంటే అప్పుడు బుకింగ్

ఢిల్లీ, మార్చి 6 : ఒక్కసారి రిజర్వేషన్‌కు సంబంధించి చార్ట్ తయారయ్యాక రైలులో సీటు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. మనకి సీటు కావాలి అంటే టిటిఈ దగ్గరకు పరిగెత్తాల్సిందే. ఆయన ఎంత డిమాండ్ చేస్తాడో ఎక్కడ సీటు ఇస్తాడో తెలియని పరిస్థితి.

వీటన్నింటికి చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రిజర్వేషన్‌కు సంబంధించి చార్ట్‌తో పాటు ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను ఐఆర్‌సిటిసి వెబ్ సైట్‌లో పొందుపరచనున్నది. దీంతో చార్ట్ తయారైనప్పటికీ సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అలాగే కోచ్‌కి సంబంధించి లేఔట్ కూడా అందుబాటులో ఉండనున్నది. దీంతో ఏ కోచ్ లో ఏ బెర్త్ కావాలో మన అభీష్టం మేరకు బుక్ చేసుకోవచ్చు.

సీట్ల లభ్యత ఆధారంగా రైలు ఎక్కే ముందు కూడా బుకింగ్ కోసం టిటిఈను సంప్రదించవచ్చు.

మొదటి చార్ట్ రైలు బయలుదేరటానికి నాలుగు గంటల  ముందు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. రెండవ చార్ట్ రైలు ప్రారంభ స్టేషన్ నుంచి బయలుదేరటానికి 30 నిముషాలకు ముందు అందుబాటులో ఉంటుంది.

మొదటి చార్ట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం జరిగిన బుకింగ్ వివరాలు, రద్దు చేసుకున్న సీట్ల వివరాల ఆధారంగా రెండవ చార్ట్ తయారుచేస్తారు.

ఈ విధానం మొబైల్, వెబ్ వెర్షన్ రెండింటిలో అందుబాటులో ఉండనున్నది.

ఐ.ఆర్.సి.టి.సి వెబ్ సైట్‌లో రిజర్వేషన్ చార్టులను తనిఖీ చేసే విధానం:

  • ఐ.ఆర్.సి.టి.సి వెబ్ సైట్‌లో “చార్టులు/ ఖాళీలు” అనే కొత్త ఎంపికను అందుబాటులోకి తెస్తున్నారు.
  • ప్రయాణికుడు రైలు నెంబర్, ప్రయాణం చేసే తేదీ, రైలు ఎక్కే స్టేషన్ వంటి వివరాలను పొందు పరచాలి. దానితో తరగతి, కోచ్ వారీగా ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు వస్తాయి.
  • కోచ్ మీద క్లిక్ చేసి ఆ కోచ్ లేఔట్ తో పాటు బెర్త్ ఖాళీగా ఉన్నదా లేదా అనే వివరాలను పొందవచ్చు.
  • పిఎన్‌ఆర్ విచారణలో కోచ్ లేఔట్‌లో పిఎన్‌ఆర్‌కు కేటాయించిన బెర్త్ స్థానం, బుకింగ్ హిస్టరీని చూడవచ్చు.