తమ వివాహ వేడుకలను పది కాలాల పాటు ప్రజలకు గుర్తుండిపోయేలా అర్భాటంగా నిర్వహించుకుంటుంటారు కొందరు. ఈ క్రమంలో వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అత్యంత ఖరీదుతో ముద్రించుకోవడం దగ్గర నుండి వివాహ వేదికను అత్యంత అందంగా తీర్చిదిద్దుకుంటారు. అంతే కాకుండా ప్రముఖ సంగీత కళాకారులతో సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే గుజరాత్ లో కొత్త ట్రెండ్ (నూతన సంస్కృతి)కి తెరలేపుతున్నారు. అత్యంత ధనవంతులు తమ వివాహ వేడుకలకు కరెన్సీని వెదజల్లుతున్నారు. గుజరాత్ లో ఒ కుటుంబం తమ కుమారుడి వివాహం సందర్భంగా ఇంటి డాబాపై నుండి రూ.100, రూ.200, రూ.500ల కరెన్సీ నోట్లను గాలిలోకి వెదజల్లింది. స్థానికులు వందలాది మంది ఆ నోట్ల కోసం ఎగబడ్డారు.

మహేసాణా జిల్లా కడీ తాలూకాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డాబాపై నిల్చున్న ఓ వ్యక్తి రూ.500ల నోట్లను గాలిలోకి వెదజల్లుతుండగా, కింద ఉన్న జనాలు వాటిని అందుకునేందుకు ఎగబడటం వీడియోలో కనిపిస్తొంది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కరీంభాయి దాదుభాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహం సందర్భంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం కావడంతో వారు ఇలా చేశారని అంటున్నారు.
ఇంతకు ముందు 2019లోనూ గుజరాత్ లోని జామ్ నగర్ లో ఓ కుటుంబం తమ కుటుంబంలో వివాహ వేడుకకు రూ.90 లక్షల రూపాయలు ఈ విధంగా వెదజల్లడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇలా చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇలా చేయడం వల్ల తొక్కిసలాట జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలా వెదజల్లే లక్షలాది రూపాయలను పేద వర్గాలకు నేరుగా అందేలా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని నెటిజన్ లు సూచిస్తున్నారు.
మరో 12 చీతాలు వచ్చేశాయోచ్ .. కునో పార్క్ లో విడుదల చేసిన సీఎం చౌహాన్..