.
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. రాజకీయ అరంగ్రేటంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన రజనీ కాంత్ అందుకు అనుగుణంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భాగంగా ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకోగా ఎన్నికల గుర్తుగా ఆటోను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
“మక్కల్ సేవై కట్టి” పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో రజనీ పార్టీని రిజిస్టర్ చేశారు. ఈ నెల 31వ తేదీన పార్టీ పేరు, జనవరిలో పార్టీ నిర్మాణంపై ప్రకటన చేస్తానని ఇప్పటికే తలైవా ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు “మక్కల్ సేవై కట్టి” అంటే తెలుగులో “ప్రజా సేవ పార్టీ” అని అర్థం. బస్సు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి అనంతరం సినీ ఇండ్రస్టీలో సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ భాషా చిత్రంలో ఆటో డ్రైవర్‌గా నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న సంగతి తెలిసిందే. రజనీ పార్టీకి ఎన్నికల సంఘం ఆటో గుర్తు కేటాయించడంతో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాబోయే సీఎం అంటూ అభిమానులు హాల్ చల్ చేస్తున్నారు.