ట్రిపుల్ కి బ్రేక్

విపక్షాల ఒత్తిడికి  అధికార పక్షం రాజ్య సభలో తలవంచక తప్పలేదు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో బ్రేక్ పడింది. విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలో బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్న కేంద్రం రాజ్యసభలో మాత్రం అలా చేయడంలో విఫలమైంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తీరాల్సిందే అంటూ విపక్షాలు పట్టుబట్టడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది. దీంతో సభలో బిల్లు ప్రవేశపెట్టడానికే సర్కార్ కు అవకాశం లేకుండా పోయింది. బిల్లును సెలక్ట్ కమిటీక ిపంపాలన్న విపక్షాల డిమాండ్ ను తిరస్కరించిన కేంద్రం…బిల్లుపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ముందుకు వచ్చింది.

అయితే సెలక్ట్ కమిటీకి పంపాలన్న తమ తీర్మానంపై చర్చ జరిగి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో తొలుత పావుగంట సేపు వాయిదా పడిన రాజ్యసభ…ఆ తరువాత కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభా కార్యక్రమాలు సాగే అవకాశం లేకపోయింది. విపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వచ్చే నెల 2కు వాయిదా వేశారు. సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఈ రోజు చర్చ జరిగి ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న భావనతో బీజేపీ తమ సభ్యులకు, కాంగ్రెస్ తమ సభ్యులకు విఫ్ జారీ చేసిన సంగతి తెలిసిందే.