Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే రాజమౌళి తో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ‘మగధీర’ తర్వాత మళ్ళి రాజమౌళి తో జతకట్టిన చరణ్ తర్వాతి సినిమా పై అప్డేట్ వచ్చేసింది.
దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తర్వాతి సినిమా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఇది రామ్ చరణ్ 15 వ కాబోతోంది. ‘రోబో2.0′ తర్వాత కమల్ హాసన్ తో భారీస్థాయిలో ‘ఇండియన్ పార్ట్ 2’ తెరకెక్కిస్తున్న శంకర్ తన తర్వాతి చిత్రంలో రామ్ చరణ్ కు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కాగా ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి 50వ సినిమా. ఈ అప్డేట్ తో మెగా అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం వచ్చేసింది. శంకర్ లాంటి విలక్షణ డైరెక్టర్ తో తమ అభిమాన హీరో జత కట్టబోతున్నాడు తెలిసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే కాంబినేషన్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్, ఇండియన్ పార్ట్ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. ఈ సినిమాలోని మిగిలిన తారాగణం టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.