ట్రస్ట్ సేవలు భేష్: వెంకటాచలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Photo credit: New Indian Express

అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పర్యటించారు. తొలుత నెల్లూరు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి వీరిద్దరూ స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వెంకటాచలంలోని అక్షర విద్యాలయం చేరుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు.

మాధవ సేవే మాధవ సేవ – మూలాలు మరవొద్దు: వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు. భరతనాట్యం, కూచిపూడిలను ప్రోత్సహించాలని, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.

ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా విద్య అందిస్తూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోందని అన్నారు. నూతన సాంకేతికతకు అనుగుణంగా వ్యవసాయంలో మెళకువలు అవసరమన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చి భారత రాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడ్డారని తెలిపారు.

తన కూతురు దీప స్వర్ణభారత్ ట్రస్ట్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. తన కూతురును చూసి గర్వపడుతున్నానని, తన కుమారుడు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన బాధ్యతను నిర్వహిస్తున్నారని తెలిపారు. ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

ప్రపంచానికి భారత్ ఎంతో మంది శాస్త్రవేత్తను అందించింది. భారత యువత సాంకేతికతలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. నూతన సాంకేతికతతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. మానవ సేవే – మాధవ సేవ సూత్రాన్ని పాటించడం గొప్ప విషయం. నూతన శాస్త్రసాంకేతికతను అందుకుంటూనే మన మూలాలను కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

వెంకయ్యనాయుడు నాకు ఆప్తమిత్రుడు: రాష్ట్రపతి కోవింద్

అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడారు. తొలుత ఆయన తెలుగు ప్రసంగించి ఆకట్టుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు ఆప్తమిత్రుడని తెలిపారు. ఆయన అజాతశత్రువు. అందరినీ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారని అన్నారు. ట్రస్ట్ సేవల గురించి చాలా విన్నాని, ఈరోజు తాను ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు.

వార్షికోత్సవం సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. సామాజిక బాధ్యతలో ముందుంటున్న ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు. మీ సేవలను విస్తృతం చేయాలని కోరుకుంటున్నా. ట్రస్ట్ 18వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. మహాత్మాగాంధీ చూపిన మార్గం అనుసరణీయమని, స్వర్ణభారత్ ట్రస్ట్ అదే మార్గంలో నడుస్తోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, గవర్నర్ నర్సింహన్, రాష్ట్రమంత్రులు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, నారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రినవాస్, ఎంపీ హరిబాబు, విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.