Rashmika mandanna: టాలీవుడ్ స్టార్స్‌ను ఇంత గట్టిగా లాక్ చేసిందేంట్రా ఈ కన్నడ బ్యూటీ..! అంటూ నెటిజన్స్ ఇప్పుడు యంగ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను చూసి మాట్లాడుకుంటున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రష్మిక ఈ రేంజ్ స్టార్ హీరోయిన్ అవుతుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసి 100 కోట్ల సక్సెస్‌లో భాగమైంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకొని సౌత్‌లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఇక సుకుమార్ – ఐకాన్ స్టార్ల అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ సినిమా పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్గా తెలుగుతో పాటు హిందీ, తమిళం, తన మాతృ భాష కన్నడ, మలయాళంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక హిందీ ఇండస్ట్రీలో రష్మికకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం అందుకుంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు పూర్తి చేసేంది. మరో రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. త్వరలో పుష్ప పార్ట్ 2 షూటింగ్లో అమ్మడు పాల్గొనబోతోంది. అలాగే, యంగ్ హీరో శర్వానంద్ సరసన రష్మిక నటిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Rashmika mandanna: మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు హీరోయిన్గా రష్మికనే ..!
అయితే, పుష్ప సక్సెస్ తర్వాత మన టాలీవుడ్ హీరోలు ఎక్కువగా రష్మికనే తమ సరసన నటింపజేయాలని గట్టిగా పట్టుబడుతున్నారట. రష్మిక ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అని చాలామంది ఫిక్స్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందబోయే పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా పాన్ ఇండియన్ రేంజ్లో రూపొందనున్న సినిమానే కాబట్టి రష్మిక లాంటి యూనివర్సల్ స్టార్ హీరోయిన్ అయితే ప్రాజెక్ట్‌కు బాగా ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇక చరణ్ కూడా హీరోయిన్గా రష్మిక అంటే బాగానే ఆసక్తిగా ఉన్నారట. అలాగే, మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు హీరోయిన్గా రష్మికనే మేకర్స్ అనుకుంటున్నట్టు సమాచారం.