ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తున్న వారికీ కరోనా సోకుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. భౌతిక దూరం పాటిస్తూ ఎప్పుడు ముఖానికి మాస్క్ ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్న వారూ కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా ఆదివారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) శక్తికాంత్ దాస్ కోరనా బారిన పడ్డారు.   తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి కోవిడ్ లక్షణాలు ఏవీ లేవని, తాను బాగానే ఉన్నానని ట్వీట్ చేశారు. ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను ఐసోలేషన్ నుండే పని కొనసాగిస్తాననీ, ఆర్ బీ ఐ పని యథాప్రకారం గానే నడుస్తుందని పేర్కొన్నారు. డిప్యూటి గవర్నర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ , టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండనున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

దేశంలో వరుసగా మూడవ రోజు కూడా కరోనా కేసులు 55వేల కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా దాదాపు మూడు నెలల తరువాత 578కి తగ్గింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలకు చేరుకోగా 70,78,123మంది చికిత్సల అనంతరం కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 68వేలుగా ఉంది. లక్షా 18,534 మంది ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందారు.