వివాహం కోసమే మతం మారడం ఆమోదయోగ్యం కాదు..!

 

మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుండి హాని ఉందని, రక్షణ కల్పించాలని దంపతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను అలహాబాదు హైకోర్టు కొట్టి వేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కోసమే మతం మార్చుకోవడం ఆమోదనీయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ముస్లిం యువతి పెళ్ళికి నెల రోజుల క్రితమే హిందూ మతం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకునేందుకే మతం మారినట్లు స్పష్టంగా అర్థం అవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠీ పేర్కొంటూ 2014లో ఇదే కోర్టులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ఒక యువతి ఇస్లాం మతంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. న్యాయమూర్తి విషయాన్ని ప్రస్తావిస్తూ పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం సరికాదని పేర్కొన్నారు. ఆయా మత విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మతాలను స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది.
ప్రియాన్షి అలియాస్ శామ్రీన్, ఆమె భాగస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2020 జూన్ 29న మతం మారగా, జూలై 31న పెళ్లి జరిగింది. అంటే వివాహం చేసుకోవడానికే మతం మారినట్లు స్పష్టమవుతోంది అని కోర్టు వ్యాఖ్యానించింది.