ఐపిఎస్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి గౌరవ్ దత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేత ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. గౌరవ్ దత్ బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్‌ నోట్‌లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమెను బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారు.

గౌరవ్ దత్ ఆత్మహత్యకు మమతా బెనర్జీయే కారణమని, తక్షణం ఆమెను అరెస్టు చేయాలని ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు.

‘ పశ్చిమబెంగాల్‌లో ఒక విశ్రాంత ఐపిఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి’ అని ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. దత్ మృతిపై పోరాడేందుకు ఐపిఎస్ అధికారుల సంఘం ముందుకు రావాలని అన్నారు.

దత్ 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. దత్ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు మమతా బెనర్జీ కారణమని ఆరోపిస్తూ… ‘ తనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా కంపల్సరీ వెయిటింగ్‌లో పెట్టారని, 2018 డిసెంబరు 31న రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదని’ దత్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దత్ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేదు.

గత మంగళవారం, కోల్‌కతాలోని తన నివాసంలో దత్ ఆత్మహత్య చేసుకున్నారు. దత్ భార్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. మణికట్టుపై గాట్లు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

దత్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ‘ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్టు ఆయనకు చెల్లించాల్సిన బకాయిలేవీ పెండింగ్‌లో లేవని, క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారని ‘ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.