‘అల్లర్లు’ కెసిఆర్ సర్కార్ అల్లిన కధా?ఆ ప్రచారంలో వాస్తవం ఇదా!

జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​ వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. మత కల్లోలాలు జరుగుతాయని, శాంతి భద్రతలకు ముప్పు ఉందన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ పోలీస్​ ఆఫీసర్లతో రివ్యూ చేసి, బెంబేలెత్తించటం వెనుక మర్మమేమిటీ..?  అసలు ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఎవరికి లాభం జరుగుతుంది..? అనే సందేహాలు గ్రేటర్​ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నాయి.

ఎలక్షన్​ క్యాంపెయిన్​ హోరెత్తిన ఈ టైమ్​లో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పట్ల ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హైద్రాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటర్లు నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపధ్యంలోనే కెసిఆర్ సర్కారు ఈ అల్లర్ల నాటకమాడుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ హీట్​ తారాస్థాయికి చేరుకుంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుని అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోంది.మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లకు గురైన బస్తీ ప్రజలు టీఆర్ఎస్ నేతలు కనిపిస్తే కారాలు మిరియాలు నూరుతున్నారు.మొత్తం మీద అధికారపక్షం ఆశించిన సానుకూల స్పందన ఈ ఎన్నికల్లో కానరాకపోవడంతో ఆపార్టీ అల్లర్ల నినాదం ఎత్తుకుందని భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తగిలితే టీఆర్ఎస్ కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అన్నది వాస్తవం.దీంతో కేసీఆర్ సర్కారు వ్యూహాత్మకంగానే అల్లర్లు అంటూ కొత్త ప్రచారానికి తెర లేపి ప్రజలను ఒకరకంగా భయభ్రాంతులకు గురి చేసే ఎత్తుగడ వేసిందంటున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో ఆరేండ్లుగా అల్లర్లు లేవని చెబుతున్నకెసిఆర్ సర్కారు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అల్లర్ల మాట ఎత్తడం ఇందుకు సంకేతం.నిజానికి హైద్రాబాద్ మహానగరం చాలా ప్రశాంతంగా ఉంటోంది.అసలెక్కడా మతకల్లోలాల వంటి సంఘటనలు జరగలేదు.అయితే ఇప్పుడు కేసీఆర్ నోట అల్లర్ల మాట రావడం కేవలం బిజెపి ని ఒక బూచిగా ప్రజలకు చూపించటమే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఇక పోలీసులు కూడా అల్లర్ల పల్లవి ఎత్తుకొని కేసీఆర్ సర్కార్ కు దన్నుగా నిలబడ్డాడు కొసమెరుపు.సాక్షాత్తూ ఆ రాష్ట్ర డీజీపీ అల్లర్ల గురించి తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని ప్రెస్ మీట్లో చెప్పారు.ఇది కూడా కెసిఆర్ బ్రీఫింగ్ అని అంటున్నారు.మరి ఎన్నికల వేళ ఏం జరుగుతుందో చూడాలి!