వాహనదారులకు వాయింపుడు ప్రారంభమైంది..!! ఓవర్ లోడ్ వాహనానికి రూ.39,800లు వసూలు

.

రాష్ట్రంలో నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు వాయింపుడు మొదలు అయ్యింది. ఇటీవల జరిమానాలను పెద్ద ఎత్తున పెంపుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనం నుండి ఏడు సీట్ల వాహనం వరకూ ఒకే జరిమానా విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వాహనాల తనిఖీ సమయంలో అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఈ జరిమానాలు తలకు మించిన భారంగా మారుతున్నాయి.

రవాణా వాహనాలపై భారీగా పెంచిన చలానా ఫీజులు, అపరాధ రుసుములు రద్దు చేయాలని కోరుతూ వివిధ ప్రాంతాల్లో వాహనదారులు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సామర్లకోట బైపాస్ రోడ్డులో ఆర్ టీ ఎ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ వెహికల్ కు రూ.39,800లు జరిమానా విధించారు. జరిమానాల పెంపుపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు. ట్రాఫిక్ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు పేర్ని నాని. నిర్లక్ష్యంగా వాహనాల నడిపే వారిపై చర్యలు తప్పవని అన్నారు. రవాణా శాఖ నిబంధనలు వాహనదారులు తూచ తప్పకుండా పాటించడం కోసమే ప్రభుత్వం జరిమానాలను పెంపు చేసిందన్నారు పేర్ని నాని.