ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎవరైతే మాకేంటి!అవధులు దాటుతున్న రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల రుబాబు!జగన్ చెప్పుకోవాలి జవాబు!

Share

అధికారులనీ లేదు.. ప్రజలనీ లేదు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు రుబాబుకు అంతులేకుండా ఉంది.బహిరంగ వేదికల మీదనుంచి సాక్షాత్తు జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చేసిన ఎమ్మెల్యే ఒకరైతే తన అనుచరుడికి లేఅవుట్ విషయంలో అడ్డు తగులుతున్నారంటూ ఎండీఓ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్నారు.

అలాగే ప్రజల మీద నోరు పారేసుకుని వారిని ఆత్మహత్యల వరకు తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు కూడా కొందరు వైసిపిలో లేకపోలేదు.ఇక మరికొందరు ఎమ్మెల్యేలు అధికారులను ఫోన్లలో అతినీచంగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వైరల్ అవుతున్నాయి.యధారాజా తథాప్రజా అన్నట్లు ఎమ్మెల్యేలు ఇలా ఉంటే వారి అనుచరులు ఇంకా రెచ్చిపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన జగన్ గాలిలో ఎమ్మెల్యేలు అయిపోయినవారు అధికార దర్పాన్ని తలకెక్కించుకుని తమకు ఎదురే లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

ఎస్పీకే వార్నింగ్!

నిన్నటికి నిన్న నెల్లూరు జిల్లా కోవూరు వైసిపి ఎమ్మెల్యే మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆ జిల్లా ఎస్పీ కి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.పద్దతి కాదు తమాషాలు పడొద్దు అంటూ ఆయన ఎస్పీ భాస్కర్ భూషణ్ పై ఒంటికాలి మీద లేచారు.తమను ఎవరు అనుకుంటున్నాడు ఎవరి గవర్నమెంట్ అనుకుంటున్నాడు బాగుండదు అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించడమే కాకుండా నెల వుంటావో రెండునెలలు ఉంటావో ఉన్నన్నిరోజులు శుద్ధంగా ఉండు అంటూ ఎస్పీకి సలహా కూడా ఇచ్చేశారు.సోషల్ మీడియాలో ఒక టిడిపి నేత వైసిపి వారిని ఉద్దేశించి పెట్టిన పోస్టింగ్ విషయంలో ఎస్పీ చట్టప్రకారం వ్యవహరించటమే ఎమ్మెల్యేకు కోపం తెప్పించిందట.వైసిపి నేతల ఫిర్యాదు మేరకు ఆ పోస్టింగ్ పెట్టిన టీడీపీ నాయకుడి మీద పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ వైసిపి వారు అడిగినట్లు ఈ కేసులో ఎస్సి ఎస్టి సెక్షన్లు జోడించకపోవడం తో ప్రసన్నకుమార్రెడ్డి ఆగ్రహించి ఎస్పీ మీద ధ్వజమెత్తారు.టిడిపి నేతపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఎస్పీ అంగీకరించకపోవడం ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. దీంతో ఆయన కొడవలూరు లో జరిగిన ఇళ్ల పట్టాలు ప్రదానోత్సవ సభలో బహిరంగ వేదిక మీదనుంచే ఎస్పీకి నాతో పెట్టుకోవద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇదే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గతంలో తన స్నేహితుడు వేసిన ఒక రియల్ ఎస్టేట్ లే ఔట్లకు పర్మిషన్లు ఇవ్వనందుకు మహిళా ఎండీ ఓ ఇంటిపై దాడి చేసిన సంఘటన జరిగింది.

నోరు పారేసుకున్న మహిళా ఎమ్మెల్యే!

గుంటూరు జిల్లా తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి సైతం తన అనుచరులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక బండ్లను పట్టుకున్నందుకు ఒక సీఐ ని ఫోనులో తిట్టిపోశారు.నా కాళ్లు పట్టుకొని పోస్టింగ్ తెచ్చుకొని ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతావా అంటూ ఆమె సీఐని అన్న ఆడియో టేప్ అప్పట్లో వైరల్ అయింది.ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పేకాట ఆడుతున్న తన అనుచరులను పట్టుకున్న ఒక ఎస్ఐని ఫోన్లో దుర్భాషలాడిన ఆడియో టేపు కూడా వెలుగు చూసింది.

ప్రజలంటే మరీ చులకన!

ఇక కొందరు ఎమ్మెల్యేలకు ప్రజలంటే అసలు లెక్కే లేకుండా వుంది.తాజాగా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ను తమ గ్రామంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయించమని నలుగురిలో అడిగిన వెంగయ్యనాయుడు అనే జనసేన కార్యకర్తపై శాసనసభ్యుడు విరుచుకుపడ్డారు.అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు. అసలు జనసేన కండువాతో నా ముందుకు రావడం ఏంటంటూ హూ౦కరించారు.ఇది జరిగిన రెండ్రోజులకే వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపుతోంది. అన్నా రాంబాబుకు ఇదేమీ కొత్తకాదు.ఇటీవలే కంభం మండలంలో పర్యటన సందర్భంగా ప్రజలు అధికారుల ముందే ఒక వీఆర్వోని నోటికి అన్నం వింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా అంటూ నలుగురి ముందు ఆయన కడిగేశారు.తక్షణం సెలవుపెట్టి వెళ్లాలంటూ లేదంటే తన్నులు తప్పవని ఆయన వీఆర్వోని హెచ్చరించిన వీడియో కూడా వైరల్ అయింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టిబాబు ఇంటిస్థలం అడిగిన ఒక మహిళా వాలంటీరు ని నోటికొచ్చినట్లు అందరిముందే తిట్టడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలికి ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఇంకా వెలుగులోకి రాని,బాధితులు బయటకు చెప్పుకోలేని సంఘటనలు అనేకం జరిగాయని చెప్పవచ్చు.ఆదిలోనే ఈ తరహా పోకడలకు వైసిపి అధినేత జగన్ అడ్డుకట్ట వేయకుంటే ఆయనకే రాజకీయంగా నష్టం వాటిల్లగలదని పరిశీలకులు చెబుతున్నారు.

 


Share

Related posts

ఈ న్యూస్ తో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఫిక్సై పోవచ్చా ..?

GRK

IND vs ENG : రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా భారత్ కి నష్టమే…? ఎలాగో చూడండి….

arun kanna

Height Growth: హైట్ పెరగాలి అనుకుంటున్నారా..!! అయితే ఇవి తింటున్నారా..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar