Ukraine Russia War: ఉక్రెయిన్ లో మౌలిక సదుపాయాలను లక్ష్యం గా చేసుకుని రష్యా దాడులను తెగబడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్ స్కీ ప్రాంతంలో కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

క్షిపణి దాడుల్లో పలు ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి. మంటలు చెలరేగాయి. డ్నిప్రొప్ స్కీ ప్రాంతంలోని తొమ్మిది అందస్తుల భవనంపై క్షిపణి దాడుల్లో 12 మరణించగా మరి కొందరు గాయపడినట్లు తెలిసింది. కీవ్ పై జనవరి ఒకటవ తేదీన రష్యా చివరి దాడి చేసింది. 13 రోజుల విరామం తర్వాత మరల దాడులకు తెగబడింది. అంతకు ముందు ఉక్రెయిన్ లోని రెండు అతి పెద్ద నగరం ఖర్కీవ్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో రష్యా .. రెండు ఎస్ – 300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. కీలక నగరం సొలెడార్ తమ ఆధీనంలోకి వచ్చిందని రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఆ వార్తలను ఉక్రెయిన్ కొట్టిపారేసింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. యుద్ద ట్యాంక్ లు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్ కి పంపుతామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో రిషి సునాక్ ఫోన్ లో మాట్లాడారు. వీరి ఫోన్ సంభాషణ తర్వాత బ్రిటన్ ప్రదాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్త సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.