ఒకే రోజు..ఒకే సమయంలో..!

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ..ఇరువురూ ఒకే రోజు ఒకే సమయంలో అమేథీలో పర్యటించనున్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. అమేథి ఎంపీగా రాహుల్ గాంధీ తన నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు. అలాగే అమోధి నుంచి గత సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ ప్రత్యర్థిగా పోటీలో నిలిచి పరాజయం పాలైన స్మృతి ఇరానీ అ తరువాత కేంద్ర మంత్రి అయ్యారు. ఓడిపోయినా ఆమె అమేథీ నియోజకరవ్గంపైనా, ఆ నియోజకవర్గ అభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు.

అలాగే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అమేథీలో శ్రీకారం చుట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా వీరిరువురూ ఇదే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా తలపడే అవకాలే మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురూ ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో నియోజకవర్గంలో పర్యటించనుండటం రాజకీయాలను వేడెక్కిస్తుందనడంలో సందేహం లేదు. తన అమేథీ పర్యటనలో రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాలలో బిజీగా గడుపుతారు. ఇక స్మృతి ఇరానీ అయితే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.