Chandrababu: సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసును ఈ నెల 9వ తేదీ (సోమవారం)కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ నిర్వహించింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతకు ముందు చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, ప్రభుత్వం, సీఐడీ తరపున ముకుల్ రోహత్గి, రింజిత్ కుమార్ లు వాదనలు వినిపించారు.
తొలుత చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకార చర్యలు నివారించడానికి సెక్షన్ 17 ఏ తీసుకొచ్చారనీ, ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా .. లేదా అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదనీ.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమని అన్నారు. అనంతరం అభిషేక్ సింఘ్వీ వాదించారు. అవినీతి నిరోధక చట్ట సవరణ లో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేబినెట్ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరు. ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగం. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతీకార చర్యల నుండి 17 ఏ రక్షణ కల్పిస్తుంది. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుంది. ట్రాప్ కేసు తప్ప మిగిలిన ఆరు రకాల ఆరోపణలకు 17 ఏ వర్తిస్తుంది, 2015 నుండి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయి. చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారు అని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. 2018 జులైలో చట్ట సవరణ వచ్చిందని, 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. 2017లోనే కేసు మూలాలు ఉన్నందున 17 ఏ వర్తించదన్నారు. కేసు విచారణ ముందే జరిగింది అనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా అని జస్టిస్ అనిరుద్ద బోస్ ప్రశ్నించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ పది శాతం ప్రభుత్వ సంస్థ, 90 శాతం ప్రైవేటు సంస్థ పేరుతో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్నారు. కేసు మెరిట్స్ పై చర్చ జరగట్లేదని.. ఆ వివరాల్లోకి వెళ్లొద్దని రోహిత్గీకి జస్టిస్ అనిరుద్ద బోస్ సూచించారు. పిటిషనర్ కౌంటర్ కూడా వేయలేదని రోహత్గీ కోర్టుకు తెలియజేయగా, చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా కల్పించుకుని కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు.
డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలని రోహత్గీ కోరారు. మొత్తం కేసు వివరాలతో సిద్దంగా ఉన్నామని లూథ్రా తెలిపారు. బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని పేర్కొన్న రోహత్గీ .. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోరారు. చంద్రబాబు జైలులో ఉన్నారు, అది కదా కష్టం అని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ వేసుకోండని న్యాయమూర్తి జస్టిస్ బోసు సూచించారు.
Nara Lokesh – AP High Court: ఏపీ హైకోర్టులో రెండు లంచ్ మోషన్ పిటిషన్లు వేసిన నారా లోకేష్