ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసిన డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజరు చేయాలన్న పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న ఉప ముఖ్యమంత్రి సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపున న్యాయవాదులు మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ ను తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన దిసభ్య ధర్మాసనం .. సాయంత్రం వాదనలు విన్నది. ఈ దశలో బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 – 22 న్యూ ఎక్సైజ్ పాలసీ లో అనేక అక్రమాలు జరిగాయని గత ఏడాది జూలైలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ లిక్కర్ పాలసీని రూపొందించినట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. అప్పటి ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జి మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా పేరునూ చేర్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి గతంలో సిఫార్సు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పలువురు నేతలతో పాటు ఢిల్లీ డిప్యూటి సీఎం పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఆరోపణల నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలనీని ఆప్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఐడీ పలువురిని అరెస్టు చేసింది. ఈ కేసులో రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారులు నిందితుడుగా ఉండటంతో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది.