జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు..! ఎందుకంటే.. ?

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు పోలింగ్ ముగిసిన వెంటనే వస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్లు ఎగ్జిట్ పోల్స్‌ కోసం కాచుకుకూర్చున్నారు. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తుంటాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉంటుంటాయి.  ఎప్పుడో ఒకటి రోజు సార్లు మాత్రం వారి అంచనాలు తప్పుతుంటాయి. అయితే జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్‌లలో ఒక డివిజన్ పోలింగ్ నేడు రద్దు అయి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పోలింగ్ ఈ నెల 3వ తేదీన జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించవద్దంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం చాలా మందికి నిరుత్సాహాన్ని కల్గించింది.

ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ పేపరులో  అభ్యర్థి కి సంబంధించిన ఎన్నికల గుర్తు తప్పుడుగా ముద్రించ డంపై  సీపీఐ నేతలు ఆందోళన నిర్వహించి పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థిగా ఫాతిమా పోటీ చేస్తున్నారు.  ఆమెకు ఎన్నికల సీపీఐ ఎన్నికల గుర్తుగా కంకి కొడవలి కేటాయించాల్సి ఉండగా సీపీఎం పార్టీ ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి కేటాయించారు. దీనిపై వారు అభ్యంతరం తెలిపారు.   ఈ నేపథ్యంలో సీపీఐ నేతల ఫిర్యాదుపై ఎస్ఈసీ ఓల్ మలక్‌పేట పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 3వ తేదీ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత వివిధ సంస్థలు వారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించుకోవచ్చు. ఆ మరుసటి రోజు 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాల వెల్లడించనున్నారు.