దేవరుడికో రక్తాభిషేకం..! దేవరగట్టు కొట్లాట రహస్యాలు..!!

“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి

“గట్టు కాడకు పోకూరు అబ్బి ఈ పాళీ నా మాట ఇనుయ్య అని ఒక అమ్మ కొడుకుని వేడుకుంటే. వెనకమ్మడే ఉండు ఉరుకుట్టేకు” అంటూ ఓ తండ్రి హెచ్చరిక చేస్తాడు..! “ఈ సరి మనమే ముందుండాల, మల్లేశ్వరున్ని గట్టు ఎక్కించాల..!” అని పంతం పడుతూ స్నేహితుల్ని ఊరడిస్తాడు మరో స్నేహితుడు…! “ఏ నాకొండే అడ్డం వస్తాడో ఈ ఏడాది తేలిపోవాలా”..! అని మరో మధ్య వయస్కుడు చిందేస్తుంటే.. సాయం సంధ్య వేళా దేవరగట్టు మాల మల్లేశ్వరుడు కల్యాణోత్త్సవం పూర్తి చేసుకొని కిందకు దిగుతాడు. దివిటీలు వెలుగులు దేవరగట్టు పొదల ముంచి భగభగ మండుతూ కాంతిపుంజల్ల దూసుకొస్తాయి..

నిమిషాల వ్యవధిలో నాలుగు గ్రామాల పురుషులంతా పోగయిపోతారు. మల్లేశ్వరుడు జైత్రయాత్ర పేరుతో కర్రలతో దండెత్తుతారు. కల్యాణోత్సవం పూర్తి చేసుకున్న మల్లేశ్వరుడిని తమతమ గ్రామాలకు తీస్కుని వెళ్లేందుకు, తర్వాత కొండ ఎక్కించేందుకు పోటీపడి కర్రలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్తారు. మాల మల్లేశ్వరుడు విగ్రహాల కోసం ఏటా ఈ తంతంగం “బన్నీ ఉత్సవం” పేరుతో కర్నూల్ జిల్లా దేవరగట్టు వేదికగా జరుగుతోంది. ఏటా మాల మల్లేశ్వరుడికి రక్తాభిషేకం సాగుతోంది. కరోనా భయంతో దీనికి పోలీసులు అనుమతులు ఇవ్వనప్పటికీ ఈ ఏడాది కూడా అదే తీరున కొనసాగింది. 27 మంది గాయపడ్డారు. అసలు దీని రహస్యాలు, కొన్ని ఆసక్తి కార అంశాలు చెప్పుకుందాం..!!

జాతీయస్థాయిలో ఖ్యాతి ఎందుకంటే..!!

కర్నూల్ జిల్లా దేవరగట్టు బన్నీ వేడుక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఉత్సవంగా గుర్తింపు ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఉత్సవం దేవరగట్టులో జరుగుతున్నా గత పదేళ్లలోనే ప్రసిద్ధి గాంచింది. మీడియాతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2008 లో ఈ ఉత్సవంలో సుమారు ౩౦౦ మందికి గాయాలు కావడం, మానవ హక్కుల సంఘాలు దీన్ని నిలిపేయాలి కోరడంతో పాటు ఈ విషయం జాతీయస్థాయికి వెళ్ళింది. దింతో ప్రభుత్వం ఉత్సవం నిర్వహణపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి పోలీసులు, వైద్య పర్యవేక్షణ మధ్య ఉత్సవం సాగుతోంది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పూర్తిగా ఉత్సవాన్ని నిలిపేయాలని సాక్షాత్తు జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెళ్లి చెప్పిన 4 గ్రామాల ప్రజలు ఊరుకోలేదు. ఉత్సవం నిర్వహణపై ఇక్కడి గ్రామాల ప్రజలు ఎంత పట్టుదలతో ఉంటారంటే ఓ ఏడాది దేవరగట్టు పరిధిలోకి వచ్చే 4 గ్రామాల ప్రజల ఇళ్లలో కర్ర లేకుండా చేసి, చాలామందిని వేరే ప్రాంతాలకు తరలించిన దసరా తర్వాత జరిగే ఈ ఉత్సవ సమయానికి వారంతా పోగుబడతారని, కర్రలు వారి చేతికి రావడం అడ్డుకోలేమని కర్నూల్ ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి చెప్పడం విశేషం.. కరోనా సమయంలోను దేవరగట్టు మల్లేశ్వరుడికి 27 మంది రక్తం చిందించి అభిషేకం చేసారు.

ఈ కొట్టుకోవడం నిజామేన..??

బన్నీ ఉత్సవంలో కర్రలను చేతబట్టి నాలుగు గ్రామాల ప్రజలు కేవలం తోపులాటలకు పాల్పడతారు. పెద్ద అరుపులతో ఒకరిపై ఒకరు పడటం, చేతిలో కర్రలు, దివిటీలు ఉండటంతో వారికీ గాయాలు అవుతాయి. కర్రలను పైకి తిప్పుతూ మల్లేశ్వర స్వామి విగ్రహాలను తోడ్కొని వెళ్లేందుకు ఆరాట పడతారు. ఈ తోపులాటలో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం, అవి చినికి చినికి గాలివానగా మరి ఇరువర్గాలు రాళ్లు రువ్వకున్న సందర్భలోనే 2008 లో విషయం పెద్దది అయ్యింది అనేది పొలిసు అధికారులు చెబుతున్న మాట. ఇలా ఏటా ఎంతో కొంత మంది గాయపడడం అక్కడ సహజంగా మారింది. అంతే తప్ప అంతమంది కర్రలతో కొట్టుకుంటే విషయం సాధారణంగా ఉండదు అని పోలీసులు చెబుతారు. మల్లేశ్వరుడిని ముందుగా తమ గ్రామం మీదుగా తీస్కుని వెళ్తే మంచి జరుగుతుంది అని ఉద్దేశంతో అనాదిగా ఎలా దివిటీల వెలుగులో మాట్లాడుకునే సంప్రదాయం ఇలా మారింది అనేది దేవరగట్టు పెద్దల మాట..!