కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సోనియా గాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ (71) నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. అప్పటి నుండి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ పటేల్ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ఈ విషయాన్ని ట్వట్టర్ ద్వారా వెల్లడించారు.

“తన తండ్రి మరణం పట్ల విచారణ వ్యక్తం చేస్తున్న వారందరికీ కరోనా వైరస్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తికి గురి కాకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను”  అని కూడా ఫైజల్ ట్వీట్ చేశారు.

అహ్మద్ పటేల్ 26 ఏళ్ల వయస్సులోనే లోక్‌సభలో అడుగు పెట్టారు. 1977లో గుజరాత్‌లోని భరూచ్ నియోజకవర్గం నుండి తొలి సారిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు గెలిచారు. ఆ తరువాత అయిదు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరిగా ఉన్నారు. 1986లో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన అహ్మద్ పటేల్ 1988లో గాంధీ – నెహ్రూ కుటుంబానికి చెందిన జవహర్ భవన్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1995లో అహ్మద్ పటేల్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజీవ్ గాంధీకి ఎంత సన్నిహితులుగా ఉన్నారో ఆ తరువాత కాలంలో సోనియా గాంధీకి కూడా అంతే సన్నిహితంగా మెలిగారు.

అహ్మద్ పటేల్ గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లా పిరామల్ గ్రామంలో  ఇషాక్ పటేల్, హవాబెన్ పటేల్ దంపతులకు 1949 అగస్టు 21న జన్మించారు.

అహ్మద్ పటేల్ మృతికి కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ, మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అహ్మద్ పటేల్ ఎంతో కాలంగా ప్రజా జీవితంలో ఉన్నారని, ఆయన మృతి బాధాకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ట్వీట్ చేశారు.