బీజేపీకి భంగపాటు!

62 views

రథయాత్రకు అనుమతికి సంబంధించి కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. బీజేపీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సాధారణ కేసులలాగే బీజేపీ రథయాత్ర కేసును కూడా పరిగణించనున్నట్లు పేర్కొంది. దీంతో బీజేపీ రథయాత్రకు బ్రేకులు పడ్డట్లయింది.

పశ్చిమ బంగాలో రథయాత్రకు అనుమతినివ్వాలని కోరుతూ బీజేపీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రథయాత్రకు అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చడాన్ని బీజేపీ సవాలు చేసింది. పశ్చిమ బంగాలో రాష్ట్రవ్యాప్తంగా 42 ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్ర చేపట్టాలని బీజేపీ సంకల్పించింది. ఈ రథయాత్రను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  చేత ప్రారంభించాలని తలచింది. తమ యాత్రకు  అనుమతి ఇవ్వాలని దీదీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ మత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనుమతిని నిరాకరణను బీజేపీ కోల్‌కతా హైకోర్టులో సవాలు చేసింది. అక్కడ బీజేపికి అనుకూలంగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించినప్పటికీ, డివిజన్‌ బెంచ్‌ ఆ తీర్పును రద్దు చేసింది. దీంతో ఆ తీర్పును సవాలు చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.