తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

 

(రాజమహేంద్రవరం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన గోకవరం మండలం తండికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది.

వివాహ వేడుక ముగించుకొని కొండ పై నుండి తిరుగు ప్రయాణమైన పెండ్లి బృందం వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో కొండపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.

సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆలయం వద్ద ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగటం ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో శ్రీదేవి (35), నాగ శ్రీ లక్ష్మి (10), కంబాల భాను (35), సింహాద్రి ప్రసాదు (25), పచ్చకూరి నరసింహం (24), చాగంటి హేమలత (12), సోమ రౌతు గోపాలకృష్ణ (72) మృతి చెందిన వారిలో ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.