యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతోంది. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా విజయవంతమైన సినిమాలనే తన అభిమానులకు అందిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే 2018లో అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద బ్రేక్ వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తవ్వగా మిగిలిన పార్ట్ వచ్చే నెల మొదటి వారం నుండి మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే.
కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను వచ్చే సమ్మర్ తర్వాత పట్టాలెక్కించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో శివగామి రమ్య కృష్ణ ఒక కీలక పాత్ర చేయనుందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే హుందాగా ఉండే ఒక లేడీ పాత్ర డిజైన్ చేయడం పరిపాటిగా మారింది.
అత్తారింటికి దారేది చిత్రం నుండి ఈ ఒరవడి మొదలైంది. అందులో నదియా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మళ్ళీ అ…ఆ లో నదియాకు అలాంటి పాత్రనే ఇచ్చాడు. సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ పాత్ర హుందాగా, చక్కగా ఉంటుంది. అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అరవింద సమేతలో దేవయాని, ఈశ్వరి రావు, అల వైకుంఠపురములో చిత్రంలో టబు.. ఇలా హీరోయిన్లు నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన వారికి బలమైన పాత్రలను ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తో సినిమాలో రమ్య కృష్ణకు మరింత పవర్ఫుల్ రోల్ ను ఇవ్వనున్నాడట. రాజకీయ నేపధ్యమున్న సినిమా కావడంతో రమ్య కృష్ణ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశం దొరికింది. ఆ పాత్ర తీరు టన్నుల గురించి తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.