బీహార్ మాత్రమే భారత్‌లో అంతర్భాగమా..? బీజెపీకీ సీఎం చురక..!!

 

(ముంబాయి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాల వాగ్దానాలు చేస్తుండటం రివాజే. ఉచిత పథకాలతో పాటు గృహోపకరణాలు (టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులు) ఇస్తామంటూ హామీలను గుప్పిస్తుంటారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపీ…ప్రస్తుత కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ ప్రకటించింది. దీనికి తోడు పార్టీ మేనిఫెస్టోలోనూ ప్రకటించింది. ఇంకా అందుబాటులోకి రాని కరోనా వ్యాక్సిన్‌ను తాము అధికారంలోకి రాగానే అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని బీజెపీ వాగ్దానం చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

కరోనా మహమ్మారి కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం బీహార్‌లో మాత్రం ఎన్నికలను పురస్కరించుకుని ఈ విధంగా బీజేపీ హామీ ఇవ్వడంపై వివిధ రాష్ట్రాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తీవ్రంగా స్పందించారు. బీజెపీ తీరుపై ఆయన మండిపడ్డారు. “మీరు అధికారంలోకి వస్తే బీహార్‌కు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి మిగిలిన రాష్ట్రాల వారు ఏంటి? ఇక్కడి వారు బంగ్లాదేశ్, కజికిస్తాన్ నుండి వచ్చారా?” అంటూ బీజెపీని ప్రశ్నించారు ఉద్దవ్ ఠాకరే. ఇలాంటి హామీలు ఇచ్చినవారు తమను తాము చూసుకొని సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యానించారు.

ఓటుకు వ్యాక్సిన్ అంశంపై పెద్ద దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో బీజెపీ ఐటి సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామ మాత్రపు ధరకు వ్యాక్సిన్ అందిస్తుందని వెల్లడిస్తూ దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా లేక ఆ ధరను ప్రజల వద్ద నుండి వసూలు చేయడమా అనేది వారు నిర్ణయించుకోవాలని అన్నారు. బీహార్‌లో మాత్రం బీజెపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిందని అమిత్ మాలవీయ వివరణ ఇచ్చారు.