ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..ఆరుగురు కరోనా బాధితులు మృతి  

 

గుజరాత్ రాష్ట్రంలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. రాజ్‌కోట్ నగరంలోని ఉదయ్ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయులో మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఐసీయులో 11 మంది కోవిడ్ పేషంట్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు.

ఆసుపత్రిలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా మరో కారణంగా జరిగిందా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాద ఘటన పై  ముఖ్యమంత్రి విజయ్ రూపాని విచారణకు ఆదేశించారు.

ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ ‌లో జరిగిన అగ్ని పమాదంలో పది మృతి చెందిన విషయం తెలిసిందే. రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అదే నెల 24వ తేదీన విశాఖలోని ఓ కోవిడ్ కేర్ సెంటర్‌లోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ కొమ్మాది శ్రీచైతన్య క్యాంపస్ లో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 64మంది కరోనా బాధితులు ఉండగా.. వారెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.