గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

అమరావతి : గుంటూరు జిల్లాలో  సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఫిరంగిపురం మండలం రేపూడి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో  ఎడ్లపాడు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కాకాని రమాదేవి (40), కాకాని యశస్విని (11నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను  గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకాని బాలామణి కంఠ  (5) మృతి చెందాడు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సిఉంది. మృతులు నరసరావుపేట శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులుచేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండటం, పెద్దలతో పాటు ఇద్దరు పసికందులు మృతువాత పడటం చూపరుల హృదయాలను కలచివేసింది.